
మురుగు కాల్వలపై మెష్‌లు ఏర్పాటు చేయాలి
రామన్నపేట: నగరంలోని ప్రధాన జంక్షన్లలోని మురుగు కాల్వలపై వెంటనే మెష్‌లు ఏర్పాటు చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ పరిధిలో చేపడుతున్న వంద రోజుల కార్యక్రమాల్లో భాగంగా బుధవారం వరంగల్‌లోని బట్టలబజార్, కృష్ణాకాలనీ, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, డీమార్ట్ ఎదుట, చార్‌బౌళి, ఎల్లమ్మ గుడి ప్రాంతాల్లో మురుగు కాల్వల జంక్షన్లను, మురుగునీరు నిలిచే ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. నగరంలో దాదాపు వంద మురుగు కాలువ జంక్షన్లు ఉన్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెష్‌లను ఏర్పాటు చేయడంతో పాటు డ్రెయిన్‌లలో వరద నీరు సాఫీగా వెళ్లేలా ప్రతీరోజు శుభ్రం చేయాలన్నారు. ఐసీసీసీకి మ్యాపింగ్ చేసి, క్రమం తప్పకుండా మానిటరింగ్ చేయాలన్నారు. మురుగు కాల్వలపై కల్వర్టులు లేని చోట తక్షణమే నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఈఈ శ్రీనివాస్, ఎంహెచ్‌ఓ రాజేశ్, డీఈలు, ఏఈలు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.