
చెర వీడేనా?
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025
నాణ్యమైన బోధన.. మెరుగైన వసతులు
సాక్షిప్రతినిధి, వరంగల్:
గొలుసుకట్టు చెరువులు కబ్జాదారుల చెరను వీడేదెన్నడు? అనే చర్చ గ్రేటర్ వరంగల్ నగరంలో సాగుతోంది. నీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాకతీయుల కాలం నాటి ఈ చెరువుల ఆక్రమణలపై ఏళ్ల తరబడి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటున్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పడిన తర్వాత వరంగల్‌లోనూ కొంత కదలిక వచ్చింది. చెరువులు, కుంటలు (ఫుల్ ట్యాంక్ లెవల్) బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోందన్న చర్చ జరిగింది. ఆక్రమణదారులు, కబ్జాదారులు ఆందోళనకు గురయ్యారు. ఆక్రమణలకు పాల్పడే వారిలోనూ ఆందోళన మొదలైంది. ఆతర్వాత మళ్లీ పరిస్థితులు సాధారణంగా మారడంతో చెరువుల చుట్టూ ఆక్రమణలు పెరుగుతున్నాయి.
అన్ని చోట్లా ఆక్రమణలే..
వరంగల్ ట్రై సిటీలోని చెరువుల శిఖం భూములన్నీ కబ్జాకు గురైనవే.. 849 సర్వే నంబర్‌లోని 386 ఎకరాల విస్తీర్ణంలోని చారిత్రక భద్రకాళి చెరువు కాకతీయుల గొలుసుకట్టు చెరువుల్లో కీలకమైంది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌లోనూ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 50–60 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆధారాలతో లోకాయుక్త వరకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరంగల్ గొర్రెకుంటలోని కట్టమల్లన్న చెరువు ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోయింది. సర్వేనంబర్ 542లో 22.04 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సిన ఈ చెరువు 12 ఎకరాలకు తగ్గింది. సుమారు పదెకరాల వరకు కబ్జాకు గురైంది. ఇందులోనూ కొందరు రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడంతో చర్యలు తీసుకోలేదనే చర్చ ఉంది. రంగశాయపేటలో సర్వేనంబర్ 241లోని బెస్తం చెరువు విస్తీర్ణం 105 ఎకరాలు కాగా.. కొందరు రెవెన్యూ, నీటిపారుదలశాఖల అధికారుల అండదండలతో ఈ చెరువు ఆక్రమణలకు గురైంది. వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో.. 2020లో సర్వే చేసిన అధికారులు 40 ఎకరాాల మేరకు ఆక్రమణకు గురైనట్లు తేల్చినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. సర్వేనంబర్ 553లో 159.10 ఎకరాల్లోని న్యూశాయంపేట కోట (కోటి) చెరువు134 ఎకరాలకు తగ్గింది. కాజీపేటలోని బంధం చెరువు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుని కుచించుకుపోయింది. 32 సర్వేనంబర్‌లో 57 ఎకరాల విస్తీర్ణంలో ఉండే చెరువు 25–30 ఎకరాలకే పరిమితమైంది. సర్వేనంబర్ 300లో వంద ఎకరాలకుపైగా ఉన్న చెరువులో 30–35 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు అప్పట్లో అధికారులే ప్రకటించారు. ఇవి మచ్చుకు కొన్నే కాగా.. చాలా వరకు గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురవడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టకేలకు భద్రకాళి చెరువు సర్వే
భద్రకాళి చెరువుతో పాటు పలు దేవాదాయ భూములు, చెరువుల ఆక్రమణలపై లోకాయుక్తలో కేసులు నడుస్తున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రెవెన్యూ అధికారులు.. వారికి సహకరించే మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై చాలా రోజులుగా విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ కన్వీనర్ చీకటి రాజు ఇటీవల కలెక్టర్ స్నేహశబరీష్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో భద్రకాళి చెరువు భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని, అదే విధంగా ఆ భూముల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్, హనుమకొండ ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు బుధవారం సర్వేయర్ పాండ్యాల రాజేశ్, సిబ్బంది ఎఫ్‌టీఎల్ పరిధిని మ్యాప్ ప్రకారం రెవెన్యూ సిబ్బందితో మార్కింగ్ చేస్తూ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో రాష్ట్రీయ హిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్, దేవాలయ పరిరక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ పల్లపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. చెరువుల ఆక్రమణలపై వెంటనే స్పందించి సర్వేకు కలెక్టర్ ఆదేశించడంపై హర్షం వ్యక్తం అవుతుండగా.. మిగతా చెరువులు కూడా ఆక్రమణదారుల చెరవీడేలా చూడాలని కోరుతున్నారు.
న్యూస్‌రీల్
కబ్జా కోరల్లో నగరంలోని గొలుసుకట్టు చెరువులు
ఆక్రమణల వెనుక కొందరు
నాయకులు, రెవెన్యూ అధికారులు
అండగా జీడబ్ల్యూఎంసీ,
ఇరిగేషన్ ఆఫీసర్లు
లోకాయుక్త, సీఎస్ వరకు ఫిర్యాదులు
రోజురోజుకూ పెరుగుతున్న ఆక్రమణలు
ఎట్టకేలకు ‘భద్రకాళి’ ఆక్రమణలపై సర్వే
కలెక్టర్ ఆదేశంతో కదిలిన
అధికార యంత్రాంగం

చెర వీడేనా?

చెర వీడేనా?

చెర వీడేనా?