
వేగంగా.. సులువుగా
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనాన్ని భక్తులకు సులువుగా కల్పించేందుకు అధికారులు, పూజారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, డీఎస్పీ రవీందర్, ఈఓ వీరస్వామి, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారులతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని సందర్శించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు సలువుగా దర్శనం కలుగుతుందన్న ఆలోచనపై పూజారులతో చర్చించారు ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్‌ప్లాన్, అధికారులు తయారు చేసిన మ్యాప్‌లను పూజారులకు కలెక్టర్ వివరించారు.
అంతిమ నిర్ణయం పూజారులదే..
ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్‌ప్లాన్ వల్ల అమ్మవార్ల దర్శనంలో భక్తులకు ఇబ్బందులు తల్తెత్తుతాయనే అభిప్రాయాన్ని పూజారులు అధికా రులకు వివరించారు. కానీ, అధికారులు సమ్మక్క– సారలమ్మల గద్దెల పక్కన వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఉంచడంపై పూజారులు సమాలోచనతో సానుకూల నిర్ణయానికి వచ్చారు. సారలమ్మ ఎంట్రెన్స్ గేట్‌ను సుమారుగా 20 ఫీట్ల దూరం విస్తరించి వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పూజారులు కొంతమేరకు ఏకీభవించారు. నలుగురు దేవతలు వరుస క్రమంలో ఉండడం వల్ల టీడీటీ కల్యాణ మండపం ద్వారా, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు రెండు వైపులా దర్శనం సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా రెండు వైపులా క్యూలైన్‌ల ద్వారా గద్దెల ప్రాంగణంలోకి వచ్చిన భక్తుల్లో ఒకేసారి పదిమంది వెళ్లేలా వెడల్పాటి మరో క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. కాగా, గద్దెల మార్పుపై రెండుమూడు రోజుల్లో పూజారులతో చర్చించి అభిప్రాయాన్ని వెల్లడిస్తామని గోవిందరాజు పూజారి.. అధికారులకు తెలిపారు.
మొక్కుల చెల్లింపులో ఇబ్బంది లేకుండా..
అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకల చెల్లింపులో భక్తులు ఇబ్బందులు పడకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా అధికారులు పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును వరుస క్రమంలో భక్తులు దర్శించుకునే సమయంలో పూజారులు సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద క్యూలైన్ లోపల ఉండి భక్తులు సమర్పించిన ఎత్తు బంగారం తీసుకుని తిరిగి ప్రసాదం అందించడంతోపాటు మొక్కు బంగారాన్ని ఎప్పటికప్పుడు బయటకు తరలించే మార్గాలను పరిశీలించారు. నాలుగు గద్దెలు వరుసక్రమంలో ఉంటే వీఐపీ, వీవీఐపీల దర్శనం సమయంలోనూ సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీవీఐపీలు అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నేరుగా హెలిపాడ్ ప్రదేశానికి వెళ్లేలా సారలమ్మ ఎగ్జిట్ గేట్ నుంచి ఐరన్‌తో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మరింత సులువుగా ఉంటుందని సమాలోచన చేశారు. పూజారులు తమ నిర్ణయాన్ని త్వరగా తెలిపితే 15 రోజుల్లో పనులు మొదలు పెడతామని కలెక్టర్ దివాకర టీఎస్ చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం దర్శనం పాస్‌లు..
ఈసారి మహాజాతరలో వీఐపీ, వీవీఐపీలు, అధికారులు, మీడియాకు షెడ్యూల్ ప్రకారం దర్శనం పాస్‌లు జారీ చేయాలనుకుంటున్నారు. అందరికీ ఒకేసారి పాస్‌లు జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈసారి జాతరకు ముందుగా నాలుగైదు తేదీల్లో పాస్‌లు జారీ చేయడంతో ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. జాతర నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే, ఆపైస్థాయి వారికి పాస్‌లు జారీ చేసే ఆలోచన చేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా సమ్మక్క మ్యూజియం, సారలమ్మ ఎంట్రెన్స్ నుంచి జంపన్నవాగు ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు దారిని విస్తరించాలని పూజారులు కలెక్టర్‌ను కోరారు. కాగా, రోడ్డును కూడా కలెక్టర్.. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
భక్తులు వనదేవతలను దర్శించుకునేలా సమాలోచనలు
మేడారంలో పూజారులతో కలిసి గద్దెల
ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్
పూజారులదే తుది నిర్ణయం