
కార్పొరేట్‌కు మోదీ సర్కారు ఊడిగం
ఖిలా వరంగల్: కేంద్రంలోని మోదీ సర్కారు కార్పొరేట్‌కు ఊడిగం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వరంగల్ అబ్నూస్ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం ప్రారంభమైన పార్టీ వరంగల్ జిల్లా ద్వితీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. 11 ఏళ్లుగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ముందుకు సాగుతోందని విమర్శించారు. కమ్యూనిస్టులను అంతం చేయలేరని, కమ్యూనిజం ప్రపంచ వ్యాప్త సిద్ధాంతం అని స్పష్టం చేశారు. అన్ని దేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారన్న విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు గుర్తెరగాలని, కమ్యూనిస్టులకు బద్ధశత్రువే బీజేపీ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.
నగరంలో భారీ ప్రదర్శన
సీపీఐ జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా బుధవారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. శివనగర్‌లోని తమ్మెర భవనం నుంచి వరంగల్ చౌరస్తా మీదుగా పోచమ్మమైదాన్ వరకు ర్యాలీ సాగింది. సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రె భిక్షపతి, రాష్ట్ర నాయకులు టి.వెంకట్రాములు, సిరబోయిన కరుణాకర్, పంజాల రమేశ్, సయ్యద్ వలీఉల్లాఖాద్రి, పల్లె నర్సింహా, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కే బాష్‌మియా, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ
సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి