వరంగల్‌ మామునూరు విమానాశ్రయం.. కొలిక్కివచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ మామునూరు విమానాశ్రయం.. కొలిక్కివచ్చేనా?

May 25 2023 12:28 PM | Updated on May 25 2023 12:56 PM

మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై మంత్రికి వివరిస్తున్న కలెక్టర్‌ ప్రావీణ్య  - Sakshi

మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై మంత్రికి వివరిస్తున్న కలెక్టర్‌ ప్రావీణ్య

సాక్షి. వరంగల్‌: వరంగల్‌ మామునూరు విమానాశ్రయ ఏర్పాటులో స్థల సేకరణ యథాతథ స్థితిలోనే ఉంది. మంత్రి కేటీఆర్‌ దాదాపు ఏడాదిన్నర నుంచి రెండుసార్లు గ్రేటర్‌ వరంగల్‌లో పర్యటించారు. ఆయా సమయాల్లో సంబంధిత అధికారులకు విమానాశ్రయ స్థల సేకరణకు ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ రైతుల నుంచి భూ సేకరణ విషయంలో అధికారులు ఇప్పటికీ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయారు.

భూమికి బదులు భూమి..
ఎయిర్‌పోర్ట్‌ కోసం 737.02 ఎకరాలు ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉంది. అయితే వరంగల్‌ విమానాశ్రయ అభివృద్ధికి ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఫేస్‌–1 కింద 179.41 ఎకరాలు, ఫేస్‌–2 కింద 264.45 ఎకరాలు భూమి సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడున్న మామునూరు ఎయిర్‌పోర్ట్‌ భూమికి అదనంగా 253 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు కేటాయిస్తే, ఎ–320 తరహాలో అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. దీనికనుగుణంగా ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ చేసిన గూగుల్‌ సర్వే ద్వారా వరంగల్‌ కోట మండలం నక్కలపల్లి, గాదెపల్లి, మామునూరు పరిధిలో అక్కడి రైతులకు చెందిన 249.33 ఎకరాల భూమి అందుబాటులో ఉందని నిర్ధారించారు.

అయితే మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను ఆనుకుని పీవీ నర్సింహారావు పశుసంవర్థక విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములు 373.02 ఎకరాలున్నాయి. వీటిని వరంగల్‌ కోట రెవెన్యూ విభాగానికి అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. భూనిర్వాసితులకు తిరిగి భూమి ఇచ్చేందుకు వీలుంటుందని రెవెన్యూ అధికారులు కలెక్టర్‌ ప్రావీణ్యకు నివేదిక ఇచ్చారు. నివేదికను పరిశీలించిన కలెక్టర్‌ బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును హనుమకొండలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో కలిసి వివరించారు. ఇలా చేయడం ద్వారా మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ సులువవుతుందని పేర్కొన్నారు. కాగా.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో చర్చిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

మీనమేషాలు..
భూసేకరణ చట్టం కింద రైతుల నుంచి సేకరించే స్థలానికి పరిహారం ఇవ్వాలా? లేక భూమికి బదులు భూమి కేటాయించాలా? అనే దానిపై అధికారులు ఇన్నాళ్లూ మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్‌ (ఉడో దేశ్‌కీ ఆమ్‌ నాగరిక్‌) పథకం కింద మామునూరు విమానాశ్రయాన్ని గతేడాది సెప్టెంబర్‌లో ఎంపిక చేశారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడంతో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పలుమార్లు గుర్తు చేసింది. దీనిపై సుధీర్ఘ కసరత్తు చేసిన కలెక్టర్‌ ప్రావీణ్య రెవెన్యూ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని భూనిర్వాసితులకు భూమి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కసరత్తు చేస్తున్నారు. అక్కడ సానుకూలంగా నిర్ణయం వస్తే మామునూరు విమానాశ్రయ స్థల సేకరణ వేగిరం చేసే అవకాశన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement