సెంట్రల్ జైలును నిర్మించాలని ఎమ్మెల్సీ వినతి
సాక్షి, సిటీ బ్యూరో: వరంగల్‌లో అత్యున్నత స్థాయి మోడల్ సెంట్రల్ జైలును నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శాసన మండలి లాబీలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వరంగల్ జైలును కూలగొట్టించిందన్నారు. మోడల్ సెంట్రల్ జైలు నిర్మాణానికి మామునూరులో 101 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ జైలు నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని అందుకే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. జైళ్ల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఖైదీల కుటుంబ సభ్యులు తనను కలిసి వరంగల్‌లో జైలు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 7వ తేదీన సబ్‌జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్, ఊర యుగేంధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–8, 10, 12, 14, 20 విభాగాల్లో ఎంపికై న వారికి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 18వ తేదీన ఆదిలాబాద్‌లో జరిగే 11వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. జిల్లాస్థాయిలో పాల్గొనే అథ్లెట్లు 7న ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రంలో జేఎన్‌ఎస్‌లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు 98665 64422 మొబైల్ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
విద్యారణ్యపురి: తెలంగాణ టీచర్ ఎలిజిలిటీ టెస్ట్ (టీజీ టెట్) హనుమకొండ జిల్లాలో ఏడు కేంద్రాల్లో శనివారం ప్రారంభమైంది. రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగింది. డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్ గౌడ్, రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, 10 మంది అబ్జర్వర్లు పరీక్షల తీరును పరిశీలించారు. ఈనెల 11 వరకు ఆతర్వాత 19, 20 తేదీల్లో టెట్ కొనసాగనుంది.
హసన్‌పర్తి: గ్రేటర్ వరంగల్ నగరంలో అర్బన్ మావోయిస్ట్ కార్యకలాపాలు చాప కింద నీరులా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్బన్ మావోయిస్టు కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న దార సారయ్య అలియాస్ శేఖర్ లొంగిపోయినట్లు డీజీపీ శనివారం ప్రకటించారు. సారయ్యది హసన్‌పర్తి మండలం మునిపల్లి. గతంలో ఈయన మావోయిస్ట్ నేత దామోదర్‌కు కొరియర్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన బుర్ర రాకేశ్.. దార సారయ్యకు మేనల్లుడు. గతంలో సారయ్యను ములుగు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఆరునెలలు జైలులో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా, సారయ్య జన జీవనంలో సంచరిస్తూనే మావోయిస్ట్ కార్యకలాపాలు కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. నిత్యం పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఖాకీలకు ఇన్నాళ్లు చిక్కలేదు.
తెల్లవారుజామున, రాత్రి వేళ ప్రయాణించొద్దు
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్‌క్రైం: పొగమంచు తీవ్రత అధికంగా ఉన్న కారణంగా తెల్లవారుజామున, రాత్రి ఫ్రయాణం చేయొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చేవాహనాలు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున, రాత్రి ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించొద్దని, ఎదురుగా వెళ్లే వాహనాలను అనుసరించడం ట్రాఫిక్ ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకోవాలని సీపీ కోరారు.
సెంట్రల్ జైలును నిర్మించాలని ఎమ్మెల్సీ వినతి


