సావిత్రిబాయి పూలే సేవలు గొప్పవి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే సేవలు గొప్పవని వరంగల్ కలెక్టర్ సత్యశారద కొనియాడారు. సావిత్రిబాయి జయంతిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ హాల్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాబోధనలో ఉత్తమ పనితీరు కనబర్చిన జిల్లాకు చెందిన 13 మంది మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించి ప్రశంసపత్రాలు అందజేశారు.
నిర్దిష్ట గడువులోగా ‘సర్’ పూర్తి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా ఫొటో ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారదతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


