తెనాలి రూరల్: వారంతా చదువు మధ్యలో ఆపేసిన వారు. బైక్ మరమ్మతు పనులు నేర్పించేందుకు మెకానిక్‌ల వద్ద తల్లిదండ్రులు చేర్పించారు. తాళం లేకుండా వాహనాలను స్టార్ట్ చేసి తీసుకెళ్లడం, ఇగ్నిషన్ వైరింగ్ మార్చి బైక్‌లను ఆన్ చేయడం నేర్చుకున్నారు. ఇంకేముంది.. బైక్‌లను చోరీ చేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. మైనార్టీ తీరని వీరు తొలి ప్రయత్నంలోనే మూడు బైక్‌లను చోరీ చేశారు. ఎక్కడ అమ్మాలో తెలియక పోలీసులకు పట్టుబడ్డారు. తెనాలి పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న బాల నేరస్తులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ పోలీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సీహెచ్. రాంబాబు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలో ఇటీవలి కాలంలో బైక్‌ల ఇగ్నిషన్ వైరింగ్‌ను తప్పించి, చిన్న వైరు ముక్క సాయంతో బైక్‌ల చోరీ జరుగుతుండడంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మూడు కేసులు నమోదైనట్టు తెలిపారు. దర్యాప్తులో ముగ్గురు బాల నేరస్తులు చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బజాజ్ పల్సర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, బజాజ్ ప్లాటినా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇంటి ముందు, బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయడంతో పాటు, వీలైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఉన్నారు. బాల నేరస్తులను జువైనెల్ హోంకు తరలించారు. బైక్‌లు చోరీ చేసి తీసుకెళుతున్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లు, వాహనాల నంబర్లను మెకానిక్‌ల గ్రూప్‌లో పెట్టడం నిందితులను గుర్తించడంలో పోలీసులకు ఉపయోగపడింది.
మెకానిక్ పనులు నేర్చుకుంటూ దొంగతనాలు చేసిన మైనర్లు


