అదే కేసులో విచారణ ఎదుర్కొన్న గోపి, శాంతిరాజు కుటుంబాలు అదృశ్యం గోపికి జనసేన సభ్యత్వం, సోదరుడు సతీష్‌కి టీడీపీ సభ్యత్వం అయినా ఇప్పటి వరకూ కనీస పరామర్శకు రాని ఎమ్మెల్యే, ఇతర కూటమి నాయకులు
తాడికొండ: చీకటి గోపి మృతిపై చీకటి కోణాలను బయట పెట్టాలని దళిత ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది. ఒంటిపై గాయాలతో పోలీస్‌స్టేషన్ నుంచి నేరుగా ఆస్పత్రిలో చేరిన గోపి తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చుబడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యులకు గోపి చనిపోయే ముందు నన్ను పోలీసులు తీవ్రంగా కొట్టారని మృతుడి సోదరుడు సతీష్, సోదరికి చెప్పి భయాందోళనకు గురయ్యాడని, ఆస్పత్రి నుంచి వెళ్తే మళ్లీ తీసుకెళ్లి చావబాదుతారంటూ భయంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన అనంతరం గోపి కాళ్లు, ఒంటిపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బంధువులు చెబుతున్నారు.
పోస్టుమార్టం నివేదిక రాకుండానే...
పోస్టుమార్టం పూర్తయిన వెంటనే నివేదిక రాకుండానే పోలీసులు ఒక అడుగు ముందుకేసి పోలీసులు అసలు కొట్టనేలేదని సెలవిచ్చారు. తాడికొండ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని చెప్పుకొచ్చారు. ఎక్కడా కొట్టినట్లు అందులో నమోదు కాలేదని చెబుతున్నా పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరా పర్యవేక్షణ లేని ఓ గది ఉండటం, అందులోకి చీకటి గోపి సహ నిందితులను విచారణ నిమిత్తం తీసుకెళ్లి తీసుకొచ్చినట్లు ఆ రికార్డుల్లో నమోదయింది. అయితే ఆ గది దుస్తులు మార్చుకునేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతి కౌన్సెలింగ్‌కు అదే గదిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
● చీకటి గోపి కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఉంగరం దొంగతనం చేసిన ప్రధాన నిందితుడు చింతచెర్ల గోపి, శాంతిరాజు ఉన్నారు. అయితే గోపి మృతి చెందిన దగ్గర నుంచి ఆ కుటుంబాలు జాడ లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అయితే వీరు భయంతో పారిపోయారా లేక వారు నోరు విప్పితే అసలు విషయం బయట పడుతుందని పోలీసులే వారిని తప్పించారా అనే ప్రశ్నలకు సమాధానం లేదు.
● మృతుడు గోపికి జనసేన సభ్యత్వం ఉంది. ఆన్‌లైన్ రసీదును కూడా బంధువులు చూపిస్తున్నారు. సోదరుడు సతీష్‌కి టీడీపీ సభ్యత్వం, ఐడీ కార్డు కూడా ఉంది. ఇంతా జరిగిన స్థానిక కూటమి నాయకులు కానీ, ఎమ్మెల్యే, ఇతర నాయకులు కనీస పరామర్శకు రాకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
● రెండు రోజుల పోలీసు కస్టడీలో విచారణ పేరుతో ఆ గదిలోకి మృతుడు గోపి, ఇతర నిందితులను సీసీ కెమెరా పర్యవేక్షణ లేని గది లోపలికి తీసుకెళ్లి బయటకు తీసుకొచ్చినట్లు కెమెరా రికార్డుల్లో స్పష్టంగా నమోదయినట్లు సమాచారం. కాగా అసలు కొట్టినట్లు ఎక్కడా కనిపించలేదు కాబట్టి పోలీసులు కొట్టలేదంటూ సమర్దించుకుంటున్నారు.


