కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా పొన్నూరు మండలంలో 26 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.4 మి.మీ. వర్షం పడింది. సగటున 5.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివరాలు.. ప్రత్తిపాడు మండలంలో 20.4 మి.మీ., పెదనందిపాడు 18.6, గుంటూరు పశ్చిమ 13.1, గుంటూరు తూర్పు 9.2, తెనాలి 3, దుగ్గిరాల 2.8, తుళ్ళూరు 2.4, మేడికొండూరు 2.4, పెదకాకాని 2.4, ఫిరంగిపురం 2.2, కాకుమాను మండలంలో 1.6 మి.మీ. చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 38.7 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 31.9 మి.మీ. వర్షపాతం నమోదైంది.
నగరంపాలెం: యూకే బ్రైటన్‌లో స్థిరపడిన ప్రముఖ తెలుగు సెలబ్రిటీ చెఫ్ కాంతికిరణ్ తమ్మా అరుదైన గౌరవా న్ని సొంతం చేసుకున్నా రు. గుంటూరు కొత్తపేటలో జన్మించారు. యూకే లో స్థిరపడ్డారు. బ్రైటన్‌న్‌లో ది స్పైస్ సర్క్యూట్ లిమిటెడ్ చెఫ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను ప్రతిష్టాత్మక బీఐహెచ్ స్పాట్‌లైట్ అవార్డ్స్ (2026)లో చెఫ్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ఫైనలిస్ట్‌గా ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 3 వేలకుపైగా నామినేషన్లు వచ్చాయి. యూకేలో దక్షిణ భారత, ముఖ్యంగా తెలుగు వంటకాలు, ఆహార సంస్కృతికి అందిస్తున్న విశిష్ట సేవలకు లభించిన అరుదైన గుర్తింపుగా ఈ గౌరవాన్ని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12న బీఐహెచ్ స్పాట్‌లైట్ అవార్డ్స్– 2026 విజేతలను లండన్‌లోని క్వాగ్లినోస్‌లో ప్రకటించనున్నారు. కాంతికిరణ్ తమ్మా చెఫ్ ఆఫ్ ది ఇయర్ ఫైనలిస్ట్‌గా నిలవడం తెలుగు వారి గర్వకారణంగా మారింది.
మంగళగిరి రూరల్: యువ ఇంజినీర్ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన కళికవాయి వెంకట శ్యామ్ (22) రాజధానిలో ఈ– 14 రోడ్డు నిర్మాణం చేస్తున్న ఓ కంపెనీలో ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో ఈ–5 క్యాంప్ నుంచి రోజు విధుల కు హాజరవుతున్నాడు. మంగళవారం మంగళగిరి మండలం నవులూరులో క్రికెట్ స్టేడియం సమీపంలో నిర్మిస్తున్న ఈ–14 రోడ్డు నిర్మాణంలో భాగంగా డ్యూటీ చేస్తున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో కాంక్రీట్ మిక్సర్ వేయాల్సిన ప్రదేశం కాకుండా ముందుకు వెళ్లడంతో డ్యూటీలో ఉన్న ఇంజినీర్ శ్యామ్ వాహనాన్ని వెనక్కి పిలవడంతో డ్రైవర్ రివర్స్ గేర్‌లో వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న అతను డైరెక్షన్ మార్చుకో అని డ్రైవర్‌కి చెప్పేలోపు వాహనం శ్యామ్‌కు తగలడంతో అతను కింద పడిపోవడం అతడిపై టైర్ ఎక్కటం క్షణాల్లో జరిగిపోయింది. తోటి ఉద్యోగులు ఎయిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు.
తెనాలి రూరల్: రైలు ఢీకొని వంట మాస్టర్ మృతి చెందిన ఘటన తెనాలి రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం జరిగింది. రైల్వే స్టేషన్ దక్షిణ క్యాబిన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో పట్టణ పాండురంగపేటకు చెందిన వంట మాస్టర్ ఎమ్మిటిశెట్టి నాగేశ్వరరావు(67) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎర్ర రంగు చేతి సంచి ఉంది. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించగా, రాత్రికి మృతుడి వివరాలు తెలిశాయి. ఎస్‌ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


