● భక్తుల కెమెరాకు చిక్కిన వన్యప్రాణి ● అటవీ శాఖ అధికారుల నిర్ధారణ ● రాత్రి వేళల్లోనే సంచారం ● భక్తులు ఆటంకం కలిగించవద్దని సూచన
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండపై అరుదైన పునుగుపిల్లి కనిపించింది. నాలుగు రోజుల క్రితం కొండపైకి వెళ్లిన భక్తులు రాళ్ల మధ్య పునుగుపిల్లి సంచరిస్తున్న దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆరా తీసి పునుపుపిల్లి సంచారాన్ని ధ్రువీకరించినట్లు సమాచారం. మంగళగిరి కొండకు సమీపంలో కృష్ణానది పరీవాహక ప్రాంతం ఉండడం, పరిసరాల్లో పంట్లతోటలు, పొదలు, నీటి వనరులు అందుబాటులో ఉండడం పునుగుపిల్లి సంచారానికి అనుకూల పరిస్థితులుగా అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా పునుగు పిల్లులు రాత్రి వేళల్లో చురుకుగా సంచరిస్తూ, పగటి సమయంలో రాళ్ల సందుల్లో, పొదలు వంటి సురక్షిత ప్రాంతాల్లో దాక్కుంటాయి. పండ్లు, చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. పునుగుపిల్లులు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో కనిపించే చిన్న క్షీరదాలు. ఆంధ్రప్రదేశ్‌లో శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాల్లో వీటి ఉనికి నమోదు అయింది. జనసంచారం ఎక్కువగా ఉండే మంగళగిరి కొండపై ఇలాంటి వన్యప్రాణి కనిపించడం, వన్యప్రాణి ప్రేమికులను, భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొండపై పునుగుపిల్లి కనిపించనపుడు దాని దగ్గరకు వెళ్ళడం, వెంబడించడం, ప్లాష్ లైట్లు వేయడం, ఆహారం అందించడం, పట్టుకునే ప్రయత్నం చేయవద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. అది తన సహజ ఆవాసంలో స్వేచ్ఛగా సంచరించేలా భక్తులు, సందర్శకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి తాడేపల్లి పరిసరాల్లో గతంలోనూ పునుగుపిల్లులు జనావాసాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది మార్చి 2న తాడేపల్లి ముగ్గురోడ్డు సమీపంలోని నివాస గృహంలోకి పునుగుపిల్లి ప్రవేశించడంతో అధికారులు దానిని సురక్షితంగా స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.


