పెదకాకాని: నంబూరు గ్రామ పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రూ.29.71 కోట్ల నిధులతో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో అనేక చోట్ల విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉప కేంద్రం వల్ల మండలంలో లోఓల్టేజి సమస్యలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్రాణం మార్కెండేయబాబు, అధికారులు, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.


