వెనిగండ్లలో మహిళ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

వెనిగండ్లలో మహిళ దారుణ హత్య

Sep 8 2026 1:47 AM | Updated on Sep 8 2026 1:47 AM

బంగారం, నగదు దోచుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు

పెదకాకాని: మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చిన ఘటన పెదకాకాని మండలం వెనిగండ్లలో చోటు చేసుకుంది. దుండగులు ఇంట్లో ఉన్న నగదు, నగలు అపహరించుకుని వెళ్లారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామానికి చెందిన దాది కోటేశ్వరమ్మ(48)కు గోరంట్ల గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. సుమారు 20 ఏళ్ల కిందట భర్తతో మనస్పర్ధలు రావడంతో పిల్లలతో కలసి స్వగ్రామం వెనిగండ్లలోనే నివసిస్తోంది. ఏడాది కిందట కుమార్తె బంతిని తన మేనల్లుడు సాయికి ఇచ్చి వివాహం జరిపించింది. గత రెండు నెలలుగా గ్రామంలోని కొండమడుగుల సంజీవరెడ్డి ఇల్లు అద్దెకు తీసుకుని ఆమె తన కుమారుడు సాధిక్‌ నివసిస్తున్నారు. సాధిక్‌ గుంటూరు ఆటోనగర్‌లో షెడ్డులో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గేదెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్న కోటేశ్వరమ్మ అనారోగ్యం కారణంతో కొద్ది రోజులుగా ఇంటి వద్దనే ఉంటుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చిన సాధిక్‌ తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇంట్లో ఉన్న రూ.6 లక్షల నగదు, 8 సవర్ల బంగార ఆభరణాలు దుండగులు దోచుకెళ్లారు. ఇంట్లో పొలం అమ్మిన డబ్బులు, బంగారం ఆభరణాలు ఉన్నట్లు పక్కా సమాచారంతో తెలిసిన వారే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటానని అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement