మెరిట్‌ విద్యార్థులకు ఓపెన్‌ కేటగిరీలో సీట్లు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

మెరిట్‌ విద్యార్థులకు ఓపెన్‌ కేటగిరీలో సీట్లు కేటాయించాలి

Sep 8 2026 1:47 AM | Updated on Sep 8 2026 1:47 AM

మెరిట్‌ విద్యార్థులకు ఓపెన్‌ కేటగిరీలో సీట్లు కేటాయించాలి ● జీఓ 102ను రద్దు చేసి 151 ప్రకారం వైద్య సీట్ల భర్తీ చేయాలి ● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మంగళగిరి టౌన్‌: మెరిట్‌ సాధించిన రిజర్వేషన్‌ వర్గాల విద్యార్థులకు ఓపెన్‌ కేటగిరీలో ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, ఓపెన్‌ కాంపిటేషన్‌ కటాఫ్‌ ర్యాంకు కంటే మెరుగైన ర్యాంకు సాధించిన రిజర్వేషన్‌ వర్గాల విద్యార్థులకు జీఓ 151 ప్రకారం ఓపెన్‌ కేటగిరీలోనే సీట్లు కేటాయించేవారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 102తో మెరిట్‌ రిజర్వేషన్‌ వర్గాల విద్యార్థులను ఓపెన్‌ కేటగిరీలో కాకుండా వారి రిజర్వేషన్‌ కేటగిరీలోనే పరిగణించడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో ఓపెన్‌ కాంపిటేషన్‌ కటాఫ్‌ ర్యాంకు 71,547 కాగా, అంతకంటే మెరుగైన ర్యాంకులు సాధించిన 43 మంది రిజర్వేషన్‌ వర్గాల విద్యార్థులకు ఓపెన్‌ కేటగిరీలో సీట్లు ఇవ్వలేదన్నారు. అలాగే ఎస్వీయూ రీజియన్‌లో 94,966 ఓపెన్‌ కాంపిటేషన్‌ కటాఫ్‌ ర్యాంకు కాగా, అంతకంటే మెరుగైన ర్యాంకులు సాధించిన 27 మంది రిజర్వేషన్‌ వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్‌ కేటగిరీలోనే సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. జీవో 102 ప్రకారం చేపట్టిన మెడికల్‌ అడ్మిషన్లను రద్దు చేసి, పాత జీవో 151 ప్రకారం మళ్లీ సీట్ల కేటాయింపులు చేపట్టాలని కోరారు. ఈ విషయంపై వైద్యశాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు కిరణ్‌, ధనుంజయరావు, వెంకటకృష్ణ పాల్గొన్నారు. జీఓ నంబరు 151 అమలును కొనసాగించాలి

● జీఓ 102ను రద్దు చేసి 151 ప్రకారం వైద్య సీట్ల భర్తీ చేయాలి ● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు

డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు డిమాండ్‌

గుంటూరు మెడికల్‌: డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోని వైద్య ప్రవేశాలకు 2020 డిసెంబరు 4న విడుదల చేసిన జీఓఎంఎస్‌ నంబరు 151ని అమలు కొనసాగించాలని, 2026 జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్‌ నంబరు 102ను పునః పరిశీలించాలని మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఏపీ అధ్యక్షుడు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం అమరావతి రోడ్డులోని ఆలా ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. జీవో ఎంఎస్‌ నంబరు 102తో నిబంధనలు డబ్ల్యూపీ నంబరు 11018/2019లో ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సు ఆధారంగా 2020 డిసెంబరు 4న ప్రభుత్వం జీఓ ఎంఎస్‌ నంబరు 151ని జారీ చేసిందన్నారు. నాటి నుంచి జీఓఎంఎస్‌ నంబరు 151కనుగుణంగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైద్య విద్య ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జీఓకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు రాలేదన్నారు. ఈ జీఓ రిజర్వు కేటగిరికి చెందిన విద్యార్థుల ప్రయోజనాలు కాపాడిందని వివరించారు. అయితే నేడు అన్ని ఐచ్చికాల పద్ధతిని నిలిపివేయాలన్న ప్రదిపాదన, హైకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ప్రవేశ విధానం స్ఫూర్తి, లక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ ఎంఎస్‌ నంబరు 151 కింద ఏర్పాటు చేసిన పారదర్శక యంత్రాంగం ఏ మాత్రం పక్కకు వెళ్లినా అది రిజర్వేషన్‌ల సమర్థంగా అమలుపై ప్రతికూట ప్రభావం చూపి విద్యార్థులకు అనవసరమైన ఆందోళనకు గురికావచ్చని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జీఓ నంబరు 102 రిజర్వు కేటగిరికి చెందిన విద్యార్థులకు నష్టం కలిగించడమే కాకుండా సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను ఉల్లంఘించినట్లు కనిపిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్‌ నంబరు 102లోని నిబంధనలను పునః పరిశీలించాలని, కౌన్సెలింగ్‌ ప్రక్రియలో అన్ని ఎంపికల విధానాన్ని కొనసాగించాలని, జీఓ 151ని మార్పులు చేయకుండా అమలు చేయాలని కోరారు. సమావేశంలో కొరివి వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement