నగరంపాలెం: గత కాల సామాజిక, నాగరికత, రాజకీయ సాంస్కృతిక, నేపథ్యాలు తెలుసుకునేందుకు చారిత్రక నవలల అధ్యయనం దోహదపడతాయని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి అన్నారు. ఆదివారం నగరంపాలెం బొమ్మిడాల ఆర్యవైశ్య వసతిగృహ సమావేశ మందిరంలో కేంద్ర సాహిత్య అకాడమీ, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగులో చారిత్రక నవలలు అంశంపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. రచయిత కోసూరి రవికుమార్ అధ్యక్షత వహించారు. అడవి బాపిరాజు చారిత్రక నవలపై షేక్ రెహమానుద్దిన్, అనువాద చారిత్రక నవలలపై సూరిప్రసాద్, నోరి నరసింహశాస్త్రి, చారిత్రక నవలలపై పిన్నమనేని మృత్యుంజయరావు పత్ర సమర్పణ చేశారు. మధ్యాహ్న సభలో రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు డాక్టర్ సిహెచ్.సుశీలమ్మ అధ్యక్షత వహించారు. విశ్వనాథ సత్యనారాయణ చారిత్రక నవలపై కె. మురళీకృష్ణ, వర్తమాన కాలంలో చారిత్రక నవలలు అంశంపై మారుతీ పౌరోహితం, ఎం.శివప్రసాద్ చారిత్రక నవలలపై ఎస్.జ్యోతి పత్ర సమర్పించి మాట్లాడారు. సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి షణ్ముఖానంద, రచయిత మోదుగుల రవికృష్ణ, డాక్టర్ వి.సింగారావ్, భూసరపల్లి వెంకటేశ్వర్లు, రావెల సాంబశివరావు, కె.శివప్రసాద్, కె.దయానంద్ పాల్గొన్నారు.


