లక్ష్మీపురం: తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ మార్పిడిలకు సంబంధించి జారీ చేసిన జీఓ నంబర్ 33ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో వీడియో విడుదల చేశారు. గతంలో కిడ్నీ మార్పిడిల పేరుతో అనేక అక్రమ దందాలు జరిగాయని, కోట్లాది రూపాయల వ్యాపారం సాగడంతోపాటు పేద, సామాన్య ప్రజలు మోసపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయన్నారు. కిడ్నీ మార్పిడిలో రక్త సంబంధీకులకు మాత్రమే అవకాశం ఉండేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత జీవో నం.33 ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు కిడ్నీ మార్పిడిల విషయంలో మరింత అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీవో నంబర్ 33ను వెంటనే ఉపసంహరించుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


