న్యూస్‌రీల్
అత్యంత ప్రమాదకరంగా కొమ్మమూరు చానల్ వంతెన కొంతభాగం కూలడంతో ఆందోళనలో వాహనదారులు బ్రిటిష్ కాలం నాటి వంతెనపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం జూలైలో ‘సాక్షి’ హెచ్చరించినా అదే తీరు కొత్త బ్రిడ్జికి రూ.43 కోట్లు మంజూరు చేసిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సకాలంలో పనులు చేపట్టకుండా చోద్యం చూస్తున్న టీడీపీ ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొత్త వంతెనకు నిధులు
గుంటూరు
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర ఆలయం అన్నమయ్య కళావేదికపై తెలుగు కళావైభవం ఉత్సవాల్లో భాగంగా శనివారం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.
చేబ్రోలు: కృష్ణా డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ, రవాణా రంగంలో మైలురాయిగా నిలిచిన చరిత్రాత్మక కొమ్మమూరు కాలువపై పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. చేబ్రోలు వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన వంతెన శిథిలావస్థకు చేరినా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. శుక్రవారం కాలువకు ఒక వైపు ఉన్న వంతెన పక్కభాగం కొంతమేర కూలిపోయింది. గత జూలై నెలలోనే ఈ వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని ‘సాక్షి’ దినపత్రికలో ‘నాడు మోక్షం.. నేడు నిర్లక్ష్యం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా అటు టీడీపీ ప్రభుత్వం, ఇటు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో కూలిపోయే పరిస్థితి వచ్చిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పురాతన వంతెన
1877వ సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు కొమ్మమూరు కాలువ నిర్మాణాన్ని పూర్తి చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రారంభమయ్యే పశ్చిమ ప్రధాన కాలువ 20 కిలోమీటర్ల దూరంలోని దుగ్గిరాల లాకుల వద్ద మూడు కాలువలుగా విడిపోతుంది. వాటిలో ఒక్కటైన కాలువపై చేబ్రోలు వద్ద బ్రిటిష్ వారు రాతి కట్టడాలు, ఇనుప రాడ్లతో ఈ వంతెనను నిర్మించారు. ఇది ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.
ప్రమాదాలకు నిలయం
గుంటూరు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చేబ్రోలు పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి పొన్నూరు, గుంటూరు, బాపట్ల, రేపల్లె, చీరాల, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారి. నిత్యం వేలాది సంఖ్యలో బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలతో రద్దీగా ఉంటుంది. వాహనదారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. వంతెన ఇరుకుగా ఉండటం, మలుపు వద్ద దారి తప్పడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6న టిప్పర్ లారీ అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొని 25 అడుగుల లోతున్న చానల్‌లో పడింది. ఆ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వంతెనపై నుంచి లారీ కాలువలో పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. వంతెన పైభాగంలో పెద్ద గుంతలు పడటంతో బండరాళ్లను అడ్డుగా పెట్టారు. రైలింగ్ కూలిపోతే ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. ప్రస్తుతం కూలిపోవడానికి ఈ నిర్లక్ష్యమే కారణమని వాహనదారులు మండిపడుతున్నారు.
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
హెవీ లోడ్‌తో శుక్రవారం వెళ్తున్న లారీ వంతెన పైభాగానికి వచ్చే సమయానికి ఎదురుగా వాహనం రావడంతో కొంత పక్కకు వచ్చి పైన ఉన్న కొండరాళ్లను ఎక్కించడంతో వంతెన కూలిపోయినట్లు సమాచారం. లారీ సహా కాలువలో పడి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేది. గతంలో ‘సాక్షి’ హెచ్చరించినప్పటికీ యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. వాహనాల రాకపోకల ఒత్తిడి కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఈ వంతెన దుస్థితిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా రూ.42.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆధునిక సాంకేతికతతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2023 ఆగస్టు నెలలో మద్రాసు కాలువపై 40 అడుగుల వెడల్పు రోడ్డు, 1.25 కి.మీ. మేర నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు వేగవంతం చేశారు. సాధారణ ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. కనీసం మొదటి దశ పనులు కూడా పూర్తి కాలేదు. పనుల్లో భాగంగా చేబ్రోలు వైపు తారు రోడ్డులో సగం వరకు తవ్వేశారు. దాని పక్కన పెద్ద గొయ్యి తీసి వదిలేశారు. ప్రమాదకరంగా ఉంచడంతో తాత్కాలికంగా కొంత మట్టి పోశారు. సమీపంలో డ్రెయిన్ ఉండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రమాదాలకు కేంద్రంగా మారింది. బ్రిడ్జి రోడ్డు మలుపుగా ఉండటంతో సగం వరకు రోడ్డు కోసుకుపోయి ఉంది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేవారు తరచుగా ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు. తాత్కాలికంగా రాళ్లు, ప్లాస్టిక్ దిమ్మెలు అడ్డుగా పెట్టారు. పురాతన బ్రిడ్జికి పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగితే ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంది.


