భావితరాలకు గురువులే మార్గదర్శకులు | - | Sakshi
Sakshi News home page

భావితరాలకు గురువులే మార్గదర్శకులు

Sep 6 2026 1:55 AM | Updated on Sep 6 2026 1:55 AM

భావితరాలకు గురువులే మార్గదర్శకులు

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ 85 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం వేడుకల వైపు కన్నెత్తి కూడా చూడని టీడీపీ ప్రజాప్రతినిధులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: భావితరాలను సన్మార్గంలో నడిపే బాధ్యత గురువులపైనే ఉందని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ అన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని నెలకొల్పడమే ధ్యేయం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు విలువలు నేర్పాలన్నారు. ఇది సమాజానికి గొప్ప పెట్టుబడి కాగలదని పేర్కొన్నారు. విలువలు అనే పునాదిపై సమాజాన్ని నిర్మించాలని కోరారు. ఇది ఉపాధ్యాయుల చేతిలో ఉందని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, మంచి సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలలో ఉంటారని, వారిని చక్కగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. మంచి నాయకత్వ లక్షణాలు అందించాలని సూచించారు. విద్యార్థులు అనుకున్నది సాధించే వరకు కృషి చేసేలా ప్రేరణ కల్పించాలన్నారు. ఒత్తిడిని, ఓటమిని తట్టుకునే శక్తి కలిగి ఉండే విధంగా విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. గాంధీ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎటువంటి కమ్యూనికేషన్‌ వ్యవస్థ లేని రోజుల్లోనే యావత్తు దేశాన్ని మమేకం చేశారన్నారు. భావితరాలకు ఏం కావాలో ఆలోచించి, అందుకు అవసరమైన మెట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గొప్ప ఆచార్యుడిగా, తత్వవేత్తగా నిలిచారని తెలిపారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు, కష్టపడి పనిచేసే వారు ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు విశ్లేషణ శక్తిని కల్పించాలని సూచించారు.

ఉన్నతమైన వృత్తి

జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీం బాషా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న పవిత్రమైన వృత్తిలో ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తుచేశారు. ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని చెప్పారు. అనంతరం 85 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ విద్యా సంస్థల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ బి. వందనాదేవి, వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లెల ఈశ్వరరావు, సమగ్రశిక్ష ఏపీసీ ఐ. పద్మావతి, డీవైఈవోలు జి. ఏసురత్నం, శాంతకుమారి, ఎంఈవోలు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకలకు టీడీపీ ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. ఏడాదికోసారి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకునే కార్యక్రమం వైపు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఉపాధ్యాయులను గౌరవించుకునే కార్యక్రమానికి వారు రాలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సైతం కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో ఉపాధ్యాయులలో తీవ్ర అసహనం వ్యక్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement