మిర్చి యార్డులో ఎగుమతి వ్యాపారుల ఐపీ కలకలం | - | Sakshi
Sakshi News home page

మిర్చి యార్డులో ఎగుమతి వ్యాపారుల ఐపీ కలకలం

Sep 6 2026 1:55 AM | Updated on Sep 6 2026 1:55 AM

మిర్చి యార్డులో ఎగుమతి వ్యాపారుల ఐపీ కలకలం

సుమారు రూ.కోటి ఐపీతో దిగుమతి వ్యాపారులకు నోటీసులు తాజాగా మరొకరి చర్యతో వ్యాపార వర్గాల్లో గుబులు

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డులోని వ్యాపార వర్గాల్లో ఐపీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. మిర్చి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్నట్లు చెబుతున్న ఓ ఎగుమతి వ్యాపారి తాజాగా సుమారు రూ.కోటి మేర ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. ఐపీ ప్రక్రియలో భాగంగా తనతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సుమారు 46 మంది మిర్చి దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. యార్డులో మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపార వర్గాల్లో రూ.కోట్లలోనే నిత్యం లావాదేవీలు జరుగుతుంటాయి. దిగుమతి వ్యాపారుల నుంచి ఎగుమతి వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ అనంతరం విదేశీ మార్కెట్లకు తరిలిస్తుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య సరుకు సరఫరా, చెల్లింపులు, బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి ఐపీ దాఖలు చేసి సంబంధిత దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపడం బాధితుల్లో ఆందోళన రేపుతోంది. తమ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని పలువురు భయపడుతున్నారు. రెండున్నర ఏళ్లుగా యార్డులో పలువురు రూ.కోట్ల మేరకు ఐపీ పెట్టడం గమనార్హం. తాజాగా మరొకరు అదే బాటలో వెళ్లడం చర్చనీయాంశమైంది.

మరో ఇద్దరిపై చర్చ..

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు మిర్చి ఎగుమతి వ్యాపారులు కూడా ఐపీ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం అధికారికంగా ధ్రువీకరణ కావాల్సి ఉంది. వారు కూడా ఐపీ దాఖలు చేస్తే దిగుమతి వ్యాపారులపై ఆర్థిక ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement