పెదకాకాని: వివా, వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నంబూరు వీవీఐటీయూలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుకొండ సైనిక్ స్కూల్ విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రతిష్టాత్మక రక్షణ మంత్రి ట్రోఫీ గ్రహీత గ్రంథి సర్వరాయుడు, ఉత్తమ ప్రిన్సిపాల్ పురస్కార గ్రహీత దారపనేని చినవెంగాయ, వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి గ్రంథి సర్వరాయుడు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో అత్యుత్తమంగా రాణించడానికి, విజయం సాధించడానికి బలమైన కాంక్షను పెంపొందించుకోవాలని సూచించారు. సంకల్పంతో లక్ష్యాల వైపు అడుగులు వేయాలని, నిరంతర ప్రయత్నం కచ్చితంగా మంచి ఫలితాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. దారపనేని చినవెంగాయ మాట్లాడుతూ విద్యార్థులు నేడు అత్యంత నూతనంగా, సృజనాత్మక కోణంలో ఆలోచనలు చేస్తున్నారని, వారి ఆలోచనా సరళికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు బోధన చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అతిథులు గ్రంథి సర్వరాయుడు, దారపనేని చినవెంగాయలను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గేయాలాపనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల విభాగం సభ్యులు, వీవీఐటీ రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకాడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, వివా ప్రిన్సిపాల్ సిహెచ్.సరళ, వివా డైరెక్టర్ లెఫ్టినెంట్ కమాండర్ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


