అమ్మవారికి ‘వైఎస్సార్‌ సీపీ’ నగల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి ‘వైఎస్సార్‌ సీపీ’ నగల సమర్పణ

Sep 5 2026 5:31 AM | Updated on Sep 5 2026 5:31 AM

తొలుత అడుగడుగునా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు రోడ్డుపై పసుపు నీళ్లు చల్లి పైశాచికానందం

పెదకాకాని: పవిత్ర శ్రావణ మాసంలో శివాలయంలో మాయమైన బంగారు ఆభరణాలను సమర్పించడానికి వెళితే టీడీపీ గూండాలు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. పెదకాకాని శివాలయంలో ఆగస్టు 14వ తేదీన అలంకరించిన బంగారు ఆభరణాలు, మంగళసూత్రాలు, నాన్‌తాడు మాయమయ్యాయని 19వ తేదీన అర్చకులు ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మూడు రోజుల పాటు కేసు నమోదు చేయకపోవడంతో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేశారు. అలాగే 27వ తేదీన నగర సంకీర్తన నిర్వహించి అమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మీదేవి రూపు సమర్పించిన సంగతి విదితమే. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి దంపతులు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, మంగళగిరి, తాడికొండ, వేమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్‌ బాబు, వరికూటి అశోక్‌బాబు, స్థానిక నాయకులతో కలిసి అంబటి మురళీకృష్ణ ఆలయానికి వెళ్లేందుకు సమీపంలో ఉన్న మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. టీడీపీ గూండాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమ్మవారి అనుగ్రహంతో ఆలయానికి చేరుకుని నాన్‌తాడు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ఎమ్మెల్యే అండతోనే టీడీపీ నేతల ఆగడాలు

వైఎస్సార్‌ సీపీ నాయకులు అమ్మవారికి ఆభరణాలు సమర్పించడానికి శివాలయానికి వెళితే ఆ రోడ్డుపై టీడీపీ వారు పసుపు నీళ్లు చల్లడం దారుణంగా ఉందని అంబటి మురళీకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ, పది రోజుల క్రితం నగర సంకీర్తన చేసి మంగళసూత్రాలు సమర్పించాం. నాన్‌తాడు శుక్రవారం రోజున సమర్పిస్తామని ప్రకటిస్తే, స్థానిక ఎమ్మెల్యే గురువారం ప్రెస్‌మీట్‌ పెట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి కార్యక్రమాన్ని అడ్డుకునే చర్యలకు పాల్పడ్డాడన్నారు. ఆలయాల్లో రాజకీయ కుట్రలు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఎమ్మెల్యే డైరెక్షన్‌తోనే టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి చేరి ఆలయానికి వెళుతున్న పార్టీ నాయకులను అడ్డుకోవడం, బైఠాయించడం, గొడవలు సృష్టించారన్నారు. టీడీపీ వాళ్లు కేవలం గొడవలు సృష్టించడానికే రోడ్డుపైకి వచ్చారన్నారు. బెల్ట్‌షాపు నిర్వహిస్తూ పట్టుబడిన వారిని పాలకవర్గ సభ్యులుగా కొనసాగిస్తున్న ఘనత టీడీపీకే దక్కిందన్నారు. భక్తులందరి సహకారంతో అమ్మవారి ఆభరణాలు సమర్పించడంతో తన జన్మ సార్థకమైందని భావోద్వేగంతో అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు గోళ్ళ జ్యోతి, ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement