గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రధానమంత్రి పోషణ్ పథకం మరింత సమర్థంగా అమలయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి పోషణ్ పథకంపై జిల్లా స్థాయి స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలులో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పౌష్టిక విలువలతో కూడిన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భోజనం తయారీలో పరిశుభ్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వంటశాలలు, భోజన ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార స్థితిపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేయాలని, పథకం అమలులో ఎటువంటి లోపాలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల వారీగా పథకం అమలు తీరును సమీక్షిస్తూ అవసరమైన చోట తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ సలీం బాషా, డీఎస్‌ఓ కోమలి పద్మశ్రీ, సివిల్ సప్లయీస్ డీఎం నాగేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయలక్ష్మి, ఐసీడీఎస్‌పీడీ ప్రసూన, అక్షయపాత్ర సంస్థ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ


