తెనాలిరూరల్: కిడ్నాప్‌కు గురైన పాలిష్ వ్యాపారి హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం నేపథ్యంలో బావమరిది కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం. తెనాలికి చెందిన చుక్క కోటినాగవీరయ్య(53) అలియాస్ నాగ మహేష్ పాలిష్ వ్యాపారం చేస్తుంటాడు. 2006లో విజయవాడకు చెందిన మహిళతో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడే కుటుంబంతో నివసిస్తున్న అతడికి రెండేళ్ల కిందట 35 ఏళ్ల దీప్తితో అయిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీప్తితో తెనాలి వచ్చేసి ఇక్కడి నందులపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ తెనాలి ఆటోనగర్‌లో పాలిష్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత నెల 29వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఆచూకీ లేకుండాపోయాడు. 30వ తేదీ ఉదయం దీప్తి నాగమహేష్ కోసం ఆటోనగర్‌కు వెళుతుండగా అతడి ద్విచక్ర వాహనం, చెప్పులు సోమసుందరపాలెం శివారులో కనిపించాయి. స్థానికులను విచారించగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారని చెప్పడంతో కిడ్నాప్‌కు గురైనట్లు నిర్ధారించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా రూరల్ సీఐ నాయబ్‌రసూల్, ఎస్‌ఐ ఆనంద్ వెళ్లి వాహనాన్ని పరిశీలించారు. భార్య, బిడ్డలను వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తూ తెనాలిలోనే ఉంటున్న నాగవీరయ్యకు విజయవాడలో సుమారు మూడు కోట్ల విలువ ఉన్న ఆస్తులు ఉన్నట్టు సమాచారం. అందులో కొంత భాగాన్ని విక్రయించి, తాను సహజీవనం చేస్తున్న మహిళ దీప్తికి ఇవ్వాలని లేదా ఆమె పేరున రాయాలని నాగవీరయ్య ప్రయత్నాలు ప్రారంభించిట్లు అతడి బావమరిదికి సమాచారం అందింది. తన సోదరి, ఆమె పిల్లలకు ఆస్తి దక్కకుండ చేస్తున్నాడన్న కోపంతో రేపల్లె సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో బావను హత్య చేయాలని ఒప్పందం కుదుర్చుకుని సుపారీ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నాగవీరయ్యను హతమార్చి ఓలేరు– రేపల్లె ప్రాంతంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఇసుక దిన్నెల్లో పూడ్చిపెట్టినట్టు అనుమానిస్తున్నా రు. పూడ్చిపెట్టిన ప్రదేశం ఏ మండలం కిందకు వస్తుందో పరిశీలించి, సంబంధిత మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మృతదేహాన్ని వెలికి తీయించే అవకాశం ఉంది. మృతుడి బావమరిది, హత్య చేసిన నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం!


