గుంటూరు వెస్ట్: మాదకద్రవ్యాల వలన బంగారు భవిష్యత్‌కు తీవ్ర అవరోధాలు ఏర్పడతాయని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల (నార్కోటిక్స్) నిర్మూలన, గంజాయి విక్రయాల అడ్డుకట్టే ధ్యేయంగా నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. తొలుత గత సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను అడిషనల్ ఎస్పీ రమణమూర్తి వివరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి పాల్గొన్నారు.
అప్రమత్తతో ప్రమాదాలను నివారించవచ్చు
చిన్నపాటి జాగ్రత్త, అప్రమత్తతతో విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి తెలిపారు. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.శనివారం స్థానిక కలెక్టరేట్‌లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రహదారి ప్రమాదాల పరిస్థితి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్ల వద్ద తీసుకుంటున్న చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల భద్రతా ప్రమాణాలపై సమీక్షించారు. ముందుగా సమావేశ ఉద్దేశాలను ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌టీఓ శ్రీహరి రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి


