వైద్య రంగంలో పీపీపీ విధానమే పెద్ద స్కాం
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్‌లో నేడు వైద్య రంగాన్ని పీపీపీ విధానంలో కొనసాగించడం అతి పెద్ద స్కాంగా మారబోతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ అనుమానాన్ని వ్యక్తం చేసింది. శుక్రవారం గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహించడం వల్ల ఆ భారం రోగులపై, వైద్య విద్యార్థులపై పడుతుందని చెప్పారు. పీపీపీ విధానంలో నిర్మించే విమానాశ్రయాలు, రహదారులతో వైద్య రంగాన్ని పోల్చకూడదని తెలిపారు. నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు రెండు పర్యాయాలు టెండర్ల ప్రక్రియను నిర్వహించినా కేవలం ఒకే ఒక్క బిడ్ రావడానికి ప్రజా వ్యతిరేకతగా భావించి ముఖ్యమంత్రి పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని ఆయన కోరారు. ఉద్యోగాలలో రాజ్యాంగ పరమైన రిజర్వేషన్లను పరోక్షంగా అంత మొందించడానికే సీఎం చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంపై అమిత ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు.
● శాసనమండలి మాజీ సభ్యుడు, కమిటీ రాష్ట్ర కో– కన్వీనర్ కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పీపీపీ పద్ధతిలో నిర్వహించ తలపెట్టిన వైద్య కళాశాలలకు ఇప్పటికే అందిస్తున్న భూములు, వసతులు, సిబ్బందికి రెండేళ్ల పాటు వేతనాలు ప్రభుత్వం చెల్లించిందన్నారు.అంతేకాకుండా అదనంగా వయాబిలిటీ గ్యాప్ ఫండ్ పేరుతో అనుయాయులకు లబ్ధి చేకూర్చడం దేశంలో మరెక్కడా లేదని విమర్శించారు.
● జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, కమిటీ కో– కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ దేశంలో అనుమతి పొందిన ఏ ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మూడు సంవత్సరాల కాల వ్యవధిలోనే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రారంభించిందన్నారు. ఐదింటిని సంపూర్ణంగా పూర్తి చేసి అమలులోకి తెచ్చిందని తెలిపారు.
మరో రెండిటిని పూర్తి చేందని చెప్పారు. కూటమి ప్రభుత్వం భూసేకరణ జరిగి నిర్మాణంలో ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేసేందుకు 20 సంవత్సరాలు పడుతుందని పేర్కొనడాన్ని అసమర్థతగా పేర్కొన్నారు.లాభాపేక్షతో ధనార్జన కేంద్రాలుగా మారిన బడా వైద్య సంస్థలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణ బాధ్యత అప్పచెప్పడం భావ్యం కాదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో 65 మెడికల్ కళాశాలలో ఉండగా, అందులో 38 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 38 మొత్తం మెడికల్ కళాశాలల్లో ప్రభుత్వ రంగంలో కేవలం 19 మాత్రమే ఉన్నాయని వివరించారు.
● దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకుడు, కమిటీ రాష్ట్ర కో– కన్వీనర్ కొరివి వినయ కుమార్ మాట్లాడుతూ పది ప్రభుత్వ మెడికల్ కళాశాలల విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 9న విజయవాడలోని ధర్నా చౌక్ లో జరిగే సామూహిక నిరసన దీక్షను పెద్దఎత్తున నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే అన్ని రాజ కీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, బ హుజన సంఘాలు భాగస్వామ్యులై సామూహిక నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు.
● జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిరంతరం నష్టాన్ని, సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్న రైతులకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండ్ వర్తింప చేయగలరా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల
పరిరక్షణ కమిటీ
జనవరి 9న విజయవాడలో
సామూహిక నిరసన దీక్ష


