పోరాటాలు, త్యాగాల చరిత్ర మాది
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : కమ్యూనిస్టులది పోరాటాలు, త్యాగాలతో కూడిన చరిత్ర అని, అటువంటి మమ్మల్ని విమర్శించే అర్హత మతోన్మాదులకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. సీపీఐ శత వసంతాల ముగింపు బహిరంగ సభ గుంటూరు అశోకనగర్‌లో శుక్రవారం జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది.
● సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఈశ్వరయ్య మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు కీలక భూమిక పోషించారని, బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టడంలో అగ్రభాగాన నిలిచారన్నారు. దోపిడీ సమాజం ఉన్నంతకాలం ఎర్రజెండా ఎగురుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని చరిత్ర ఆర్‌ఎస్‌ఎస్‌దని విమర్శించారు. జాతీయ పతాకాన్ని ఆమోదించి ఎగురవేయలేని శక్తిహీనులని, వారు దేశభక్తి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాలలో దేశం ఏ రంగంలో ప్రగతి సాధించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జనవరి 18న జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు గుంటూరు జిల్లా నుంచి వేలాదిగా తరలిరావాలని ఆయనన పిలుపునిచ్చారు.
● సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి రాజకీయ ప్రయోజనాల కోసం శ్రామికవర్గం చెమటోడ్చి సృష్టిస్తున్న సంపద మొత్తంను కార్పొరేట్లకు దోచిపెడుతుందని మండిపడ్డారు.
● రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ అశేష త్యాగాలు చేయడంతో పాటు జమీందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బందెల నాసర్ జీ, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ఇష్టా జాతీయ కార్యదర్శి గని, సీపీఐ జిల్లా నాయకులు షేక్ వలి, పుప్పాల సత్యనారాయణ, చిన్ని తిరుపతయ్య పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య


