ప్రైవేటు బ్యాంకులు పనితీరు మార్చుకోవాలి
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంకర్లు పనిచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపులు కమిటీ(డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ ఆర్‌ఎస్)సమావేశంలో పెమ్మసాని మాట్లాడారు.
● కౌలు రైతులకు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకులు కూడా రుణాలు అందించాలన్నారు. గత సంవత్సరం కంటే ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు రుణాల మంజూరు మెరుగుపడిందని బ్యాంకర్లను అభినందించారు.
● ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడంలో ముందంజలో ఉన్నాయన్నారు. ప్రైవేటు బ్యాంకులు కౌలు రైతు రుణాలతో సహా విద్యా రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరులో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
● రానున్న మూడు నెలలు ప్రైవేట్ బ్యాంకులు రుణాల మంజూరులో పనితీరు మెరుగుపరచుకోకపోతే , ఆ బ్యాంకుల పేర్లతో సహా ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. సంబంధిత బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ ఖాతాలను, డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేయడం జరుగుతుందన్నారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హాసన్ బాషా, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ పద్మావతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ సత్యనారాయణ, మెప్మా పీడీ విజయలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, నాబార్డ్ డీడీఎం జి. శరత్ బాబు, ఆర్‌బీఐ ఎల్డీఓ నవీన్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్


