నీతి, నిజాయతీతో సేవలు అందించిన లక్ష్మీనారాయణ
నగరంపాలెం: విధి నిర్వహణలో నీతి, నిజాయతీగా సేవలు అందించి, కుటుంబాన్ని క్రమశిక్షణ, విలువలతో తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి చెంచు లక్ష్మీనారాయణ అని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కొనియాడారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలోని పద్మావతి కల్యాణ వేదికపై శుక్రవారం తెలంగాణ విశ్వ విద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు డాక్టర్ సీహెచ్.లక్ష్మణ చక్రవర్తికి లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురసార ప్రదానం –25, ప్రొఫ్రెసర్ సీహెచ్.సుశీలమ్మ సాహితీ స్వర్ణోత్సవ వేడుక నిర్వహించారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సభకు డాక్టర్ ఎంసీ దాస్ అధ్యక్షత వహించి మాట్లాడారు. మద్రాస్ విశ్వ విద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ సాహిత్యం విలువలతో కూడి, సమాజాభివృద్ధికి దోహదం చేసేలా ఉండాలని తెలిపారు. సాహిత్యాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు విమర్శ చికిత్స చేసే వైద్యునిగా ఉండాలని సూచించారు. పురస్కార గ్రహీత డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ సాహిత్య స్వర్ణోత్సవంలోకి అడుగిడిన డాక్టర్ సుశీలమ్మ తండ్రి స్మారక పురస్కారం స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. సభలో నిర్వాహకురాలు ఆచార్య సీహెచ్.సుశీలమ్మ, విశ్రాంత ఏఈసీ షేక్ అహ్మద్ షరీఫ్, ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు, బండ్ల మాధవరావు, డాక్టర్ ఓరుగంటి వెంకటరమణ, మోదుగుల రవికృష్ణ, డాక్టర్ వీవీ రామ్‌కుమార్, పంచమర్తి సుశీల, డాక్టర్ వి.నాగరాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు


