265 మొబైల్ ఫోన్లు అప్పగింత
నగరంపాలెం: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సుమారు రూ.53 లక్షల విలువైన 265 మొబైల్ ఫోన్లను పొగొట్టుకున్న వారికి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.7.53 కోట్ల విలువైన 3,679 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. బాధితుల ఫిర్యాదుల ఆధారం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైన వెంటనే పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 8688831574 లేదా సీఇఐఆర్ వెబ్‌సైట్ లేదా జిల్లా సైబర్ సెల్ లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు చేయాలని ఆయన సూచించారు. ఐటీ కోర్ సీఐ నిషార్ భాషా, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, ఇమామ్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు.


