
ఇన్‌స్పైర్ నామినేషన్లు పెంచండి
బాపట్ల డీఈఓ పురుషోత్తం
బాపట్ల అర్బన్: ఇన్‌స్పైర్ అవార్డుల కోసం నామినేషన్ తప్పనిసరిగా ఉండాలని డీఈఓ పురుషోత్తం తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం మండల నోడల్ సైన్స్ ఉపాధ్యాయులకు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... ప్రతి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రాజెక్టులు నూతన ఆవిష్కరణలకు దారి తీసేలా ఉండాలని, పేటెంట్ హక్కులు పొందే స్థాయి వరకు వెళ్లే విధంగా విద్యార్థులకు తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడమే ఉపాధ్యాయుల కర్తవ్యం కావాలని పేర్కొన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సెప్టెంబర్ 15వ తేదీలోపు బాపట్ల జిల్లా నుంచి గరిష్టంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి హాజరైన నోడల్ సైన్స్ ఉపాధ్యాయులు వెంటనే తమ మండలాల్లోని అన్ని పాఠశాలలు రిజిస్టర్ అయ్యేట్లు చూడవలసినదిగా ఆదేశించారు. జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్, నోడల్ టీచర్లు పాల్గొన్నారు.