
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో రభస
పెదకాకాని: శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదానికి దారి తీసింది. పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో చెరువు కట్టపై శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం విగ్రహావిష్కరణ నేపథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రయాదవ్ శనివారం అక్కడకు చేరుకున్నారు. యాదవులు, హిందువులు ఆరాధ్యదైవంగా భావించి పూజలు చేసుకునే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడం అవమానించడమేనని తెలిపారు. దీనిపై పెదకాకాని పోలీసుస్టేషన్‌లో బీసీవై పార్టీ ప్రతినిధులు, అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులు రాత్రి 12 గంటల వరకూ చర్చలు జరిపారు. అదే విగ్రహం చేతిలో ప్లూటు, కిరీటంలో నెమలి పింఛం లేకుండా టీడీపీ మండల స్థాయి నాయకులు ఆవిష్కరించారు. దీంతో ఫిర్యాదుకు సంబంధించి రశీదు పొందేందుకు ఆదివారం సాయంత్రం పోలీసుస్టేషన్‌కు చేరుకున్న బీసీవై పార్టీ ప్రతినిధులు అక్కడ నుంచి తక్కెళ్లపాడు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో విగ్రహావిష్కరణ సమయంలో ఏర్పాటు చేసిన మైక్ ద్వారా తక్కెళ్లపాడు విగ్రహావిష్కరణ వద్దకు కరాటే కల్యాణి వస్తుందని చెప్పడంతో 300 మంది దాకా అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీసీవై పార్టీ నాయకులకు, విగ్రహావిష్కరణ కమిటీ ప్రతినిధులకు వాదోపవాదనలు జరిగాయి. విగ్రహం వద్దకు రాకుండా స్థానికులు, టీడీపీ నాయకులు బీసీవై నాయకులను అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని బీసీవై ప్రతినిధులను అక్కడి నుంచి పంపించి వేశారు. దేవుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం హిందువులను, యాదవులను అవమానించడమేనని బీసీవై నాయకులు తెలిపారు. విగ్రహాన్ని అదే చెరువులో సోమవారం 11 గంటలకు నిమజ్జనం చేద్దామని భారత చైతన్య యువజన పార్టీ అధినేత ‘చలో తక్కెళ్లపాడు’కు పిలుపునివ్వడంతో విగ్రహావిష్కరణ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.
తక్కెళ్లపాడులో ఘటన
విగ్రహం వద్దకు చేరుకున్న బీసీవై పార్టీ ప్రతినిధులు
ప్రతిఘటించిన నిర్వాహకులు
పోలీసులు రంగ ప్రవేశం

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో రభస