
కూటమి పాలనలో రాక్షసత్వం
బీసీ కుటుంబాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడు వెంకటప్రసాద్ కుటుంబసభ్యులను పరామర్శించిన వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలని టీడీపీకి హెచ్చరిక
వినుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
వెంకటప్రసాద్ భార్య శ్రావణితో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి మురళీకృష్ణ, వనమా బాలవజ్రబాబు, నూరిఫాతిమా
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నడూ లేని విధంగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టి.అన్నవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట ప్రసాద్, ఆయన కుటుంబసభ్యులపై హత్యాయత్నాన్ని ఖండించారు. జిల్లాలో ఇలాంటి దారుణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సానుభూతి పరులపై కూడా రాక్షసత్వం చూపుతున్నారని ఆరోపించారు.
కొనసాగుతున్న చికిత్స
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టి.అన్నవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకటప్రసాద్, ఆయన కుటుంబసభ్యులపై శనివారం రాత్రి టీడీపీ మూకలు మరణాయుధాలు, కర్రలతో విచక్షణరహితంగా దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన ఆయన్ను మెరుగైన వైద్యసేవల నిమిత్తం గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), షేక్ నూరి ఫాతిమా(గుంటూరు తూర్పు), వనమా బాల వజ్రబాబు (తాడికొండ), నాయకులు ఆదివారం ఆరా తీశారు. వెంకటప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం మారాక సమాధానం ఇస్తాం
గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ వినుకొండలో ఇలాంటి ఘటన రెండోదని చెప్పారు. గతంలో రషీద్‌ను ఎలా హత్య చేశారో అందరికీ తెలుసన్నారు. వెంకటప్రసాద్‌పై హత్యాయత్నం దారుణం అన్నారు. మహిళలని కూడా చూడకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరీ విచక్షణరహితంగా దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారుతుందని, అప్పుడు గిఫ్ట్ రూపంలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
‘కూటమి’వి హత్యారాజకీయాలు
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ వెంకట ప్రసాద్ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్‌గా పనిచేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని బెదిరించడం టీడీపీ సాధారణమైందన్నారు. కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వెంకటప్రసాద్‌పై హత్యాయత్నం విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీసీ కుటుంబంపై కక్షసాధింపు
తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. వెంకటప్రసాద్ పార్టీ ఏజెంట్‌గా కూర్చోవడం పాపమా ? అని ప్రశ్నించారు. బీసీ కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వీటిని ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇప్పటికై నా టీడీపీ సక్రమ పద్ధతిలో నడవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు సహించబోమన్నారు.
దాడులను ప్రోత్సహిస్తున్న సర్కార్
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వెంకటప్రసాద్‌పై హత్యాయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఇటువంటి దాడులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించడం సరికాదని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారుతుంటాయనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అనంతరం వెంకటప్రసాద్ భార్య శ్రావణి, సోదరి మాధవి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కూటమి పాలనలో రాక్షసత్వం

కూటమి పాలనలో రాక్షసత్వం