
కొండవీటి వాగు పొంగి తీరని నష్టం
నగరంపాలెం: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు కొండవీటి వాగు పొంగి గుంటూరు చానల్ మీదుగా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని 30 వేల ఎకరాలు నీట మునిగాయని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న కురిసిన కుంభవృష్టి వల్ల జరిగిన నష్టాన్ని గూగులో మ్యాప్ ద్వారా వివరించారు.
కొండవీటి వాగులోని నీరు గుంటూరు చానెల్ ద్వారా రావడంతో కట్టలు తెగి పంట పొలాలు మునిగాయని వివరించారు. రాజధానిపై వస్తున్న విమర్శలను నుంచి కాపాడుకునేందుకు కొండవీగు వాగు నీరు గుంటూరు చానెల్‌కు రాలేదని సత్యదూరమైన మాటలు కూటమి ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. కొండవీటి వాగు నీరు గుంటూరు చానెల్‌లో సీతానగర్ వద్ద ప్రత్యక్షంగా, కాజా టోల్‌గేట్ వద్ద పరోక్షంగా ప్రవహించిందని పేర్కొన్నారు. ఇప్పటికే రెండుసార్లు రైతులు వరి పొలాల్లో వెద పెట్టారని, మూడోసారి పెట్టే అవకాశాల్లేవని తెలిపారు. దీంతో నారుముడి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అర్భాటంగా ప్రారంభించిన అన్నదాత సుఖీభవ సక్రమంగా అమలు జరగడంలేదని ఆరోపించారు. వెంటనే తాత్కలిక భృతి కింద నారు వేసేందుకు ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.10 వేలు, ఉచితంగా ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖపై అవగాహన లేక మాట్లాడుతున్నారని విమర్శించారు. కొండవీటి వాగు లోతు, వెడల్పు పెంచకుండా రాజధాని ప్రాంతంలో డ్రైనేజీ, వర్షపు నీరు ప్రవహించేలా చేయకుండా నగరాన్ని నిర్మించలేమని చెప్పారు. రాజధాని మునుగుతుందని, అక్కడ నీరు పొన్నూరు నియోజవర్గం వైపు పంపు చేశారని తాను ఎప్పుడు మాట్లాడలేదని వివరించారు.