
కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన గుడ్‌మా ర్నింగ్ నరసరావుపేట కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలమంది దివ్యాంగులకు పింఛన్లు తొలగించారని తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో 850 మందికి తొలగించారన్నారు. కనీసం వారికి సదరం క్యాంపునకు రమ్మని పిలుపు కూడా ఇంతవరకు లేదని అన్నారు. ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, తొలగించిన పెన్షన్ల మిగులు డబ్బుతో పెంచిన డబ్బును అందిస్తున్నారని, ఇది దారుణమైన అంశమని విమర్శించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు దందాలు చేస్తూ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత రూ.2 కోట్లు లంచం తీసుకొని జీవిత ఖైదీ అనుభవిస్తున్న శ్రీకాంత్‌ను పెరోల్‌పై విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. ఈ పెరోల్‌కు గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సిఫార్సు లెటర్లు ఇవ్వడం మరింత దారుణమైన అంశమని అన్నారు. శ్రీశైలం, గుంటూరు–2లో మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని, సౌమ్య అనే కేజీవీబీ స్కూల్ ప్రిన్సిపాల్‌పె అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు పాల్పటం వల్ల ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని, అయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తెలిపారు. అనంతపురంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అక్కడి శాసనసభ్యుడు బూతులు తిడుతూ కామెంట్లు చేశారని, ఆ సినిమాకు వెళ్లొద్దని ప్రజలకు ఆదేశాలు ఇచ్చారన్నారు. సినిమాలు వేరు, రాజకీయం వేరని, ఈ రకంగా శాసనసభ్యుడు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని గోపిరెడ్డి ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి