
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో అవగాహనా సమావేశం ఆదివారం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నిలబడాలి.. వైఎస్సార్‌సీపీది ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
‘‘మనమంతా బలమైన వ్యవస్ధగా రూపొందాం. మీరంతా మీ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే అవకాశం మీకు పార్టీలో కల్పించబడింది. దానిని ఛాలెంజ్‌గా తీసుకుని మీరు నిలబడాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతుకగా మనం నిలబడాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు.