యూరియా.. లేదయా! | - | Sakshi
Sakshi News home page

యూరియా.. లేదయా!

Aug 24 2025 7:30 AM | Updated on Aug 24 2025 7:30 AM

యూరియ

యూరియా.. లేదయా!

యూరియా.. లేదయా!

అన్నదాతలను అష్టకష్టాలు పెడుతున్న కూటమి ప్రభుత్వం

ఇప్పటికే వరదలకు 72 వేల ఎకరాల్లో కుళ్లిపోయిన పంట మిగిలిన పంటను కాపాడుకునేందుకు దొరకని యూరియా అధికారులు చెబుతున్న లెక్కల్లో మాత్రమే సరిపడా నిల్వలు క్షేత్ర స్థాయిలో అస్సలు అందుబాటులో లేక రైతుల అవస్థలు బ్లాక్‌ మార్కెట్‌కు భారీగా తరలి పోతుండటంతో తీవ్ర కొరత కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్న కర్షకులు

కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. వరి సాగు మొదలుపెట్టి నాట్లు వేశారో లేదో.. భారీ వానలతో నీట మునిగాయి. మళ్లీ కాస్త తేరుకునేలోపే వరుణుడు కన్నెర్రజేశాడు. ఈసారి ఎక్కువ నష్టం తప్పలేదు. పంట పూర్తిగా నీట మునిగిపోయింది. యూరియా, డీఏపీ వంటి ఎరువులు వేస్తే పంట బతుకుతుందనే ఆశతో కర్షకులు ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవీ అందుబాటులో లేవు. అరకొరగా లభ్యమైనా ధరలు పెరగడంతో రైతులపై ఆర్థికం భారం పడుతోంది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో సుమారు 72 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన సంగతి తెలిసిందే. జిల్లాలో వర్షాలు తగ్గి మళ్లీ ఎండలు మొదలయ్యాయి. నీటి ముంపునకు గురి అయిన మాగాణి పొలాలను కాపాడటానికి రైతులు యూరియా వాడతారు. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు పదును దాటక ముందే 2,3 రోజులలోనే యూరియా వాడాలి. పదును దాటితే వాడినా ఉపయోగం ఉండదు. దీంతో యూరియా వాడకం పెరిగింది. అధికారులు చెబుతున్నవన్నీ కాకి లెక్కలుగానే ఉన్నాయి. ఖరీఫ్‌కి కావాల్సిన ఎరువుల కన్నా తమ వద్ద ఎక్కువే స్టాక్‌ ఉందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలోని పలు పీఏసీఎస్‌ల వద్ద రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి.

ఆధార్‌ కార్డు చూపితే..

రెండు రోజుల క్రితం పెదకాకాని మండలం ఉప్పలపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని గోళ్ళమూడి గ్రామంలో లారీ రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తీసుకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 5 బస్తాల చొప్పున అమ్మకాలు చేశారు. 5 బస్తాలు యూరియా రూ.1,350 చొప్పున విక్రయించారు. తర్వాత రోజున ఆధార్‌ కార్డు తీసుకువచ్చిన వారికి రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. చాలాచోట్ల యూరియా అందుబాటులో లేదు. యూరియా, డీఏపీలు రైతు సేవా కేంద్రాలు, సొసైటీలో కూడా ప్రస్తుతం దొరకని పరిస్థితి నెలకొంది. అధిక రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి షాపుల్లో కూడా ఎరువులు ఇవ్వడం లేదు. ప్రత్తిపాడు మండలం ఒక్క వంగిపురం రైతు సేవా కేంద్రానికి మాత్రమే ఇప్పటివరకు 20 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. మిగిలిన 11 రైతు సేవా కేంద్రాల్లో ఎక్కడా యూరియాగానీ, కాంప్లెక్స్‌ ఎరువులుగానీ అందుబాటులో లేవు. ఒక్కో ఆర్‌ఎస్‌కేకు 20 మెట్రిక్‌ టన్నుల చొప్పున అన్ని కలిపి ఇండెంట్‌ పెట్టినప్పటికీ స్టాక్‌ రాలేదని రైతులు చెబుతున్నారు. ప్రత్తిపాడు మండలంలో మూడు పీఏసీఎస్‌లు ఉన్నాయి. వాటిల్లోనూ ఎరువులు లేవు. కనీసం సొసైటీల్లో ఇండెంట్లు కూడా పెట్టని పరిస్థితి నెలకొంది. యూరియా అందుబాటులో లేకపోవడంతో కట్ట రూ.270కు విక్రయిస్తున్నారు. బ్లాక్‌లో రూ.400లు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎరువులు అందుబాటులో ఉంచాలి

నందివెలుగులో ఉన్న నాలుగెకరాలు కౌలుకి, ఒక ఎకరం సొంత పొలంలో సాగు చేస్తున్నా. అధిక వర్షాలతో ఎకరాకు రూ.10 వేల వరకు నష్టపోయాం. ఇప్పుడు పొలాల్లోని నీరు బయటకు పోయింది. పైరుకు యూరియా, డీఏపీ ఎరువులు చల్లుతున్నారు. అందుబాటులో ఉంచడంతోపాటు ఉచితంగా ఇవ్వాలి. పంటనష్టం భారీగా జరిగినందున రైతులకు పరిహారం చెల్లించాలి.

– తోటకూర కోటేశ్వరరావు,

రైతు, నందివెలుగు గ్రామం, తెనాలి మండలం

అదనపు ఖర్చు తప్పడం లేదు

నేలపాడులో సొంతంగా 5, కౌలుకు 12 ఎకరాలు సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.30 వేలు కౌలుకు చెల్లిస్తున్నా. సీజను ఆరంభంలో వరి వెదజల్లాం. ఎకరాకు రూ.2,500 వరకు ఖర్చు అయింది. వర్షాలకు అది దెబ్బతింది. యూరియా వేశాం. ఫర్వాలేదని అనుకునేలోపు భారీ వర్షంతో మళ్లీ పైరు దెబ్బతింది. పైపాటుగా వరి నాటిస్తున్నాం. ఖర్చు తప్పడం లేదు. ఎరువులూ లేవు.

– సోమవరపు నాగేశ్వరరావు,

రైతు, నేలపాడు గ్రామం, తెనాలి మండలం

పంట మొత్తం కుళ్లిపోయింది

ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట ముంపునకు గురై మొత్తం కుళ్లిపోయింది. గ్రామంలో ఎకరం రూ.25 వేల చొప్పున చెల్లించి 10 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. ఎకరానికి రూ.15 వేలు వరకు పెట్టుబడి పెట్టా. భారీ వర్షాలతో పంట మొత్తం పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ సాగు చేయాలంటే వరి నారు కొనుగోలుకు, నాట్లు వేయడానికి ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు అవుతుంది.

– యర్రాకుల వీరాంజనేయరాజు,

రైతు, వీరనాయకుని పాలెం, చేబ్రోలు మండలం

మంత్రి జోక్యం చేసుకోవాలని వినతి

తెనాలి: ౖరైతుల అవసరాలకు తగినట్టుగా డీఏపీ, యూరియా సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్‌ చేశారు. తెనాలి నియోజకవర్గంలో ఎరువులు అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమీపంలోని దుగ్గిరాల, వేమూరులోని మార్కెటింగ్‌ సొసైటీల ద్వారా మార్కెట్‌ యార్డుల్లో దొరుకుతున్న ఎరువులు, తెనాలి మార్కెట్‌ యార్డులో ఎందుకు అందుబాటులో లేవని ఆయన ప్రశ్నించారు. యూరియా ధర కొన్నిచోట్ల రూ.400–450లకు ఉందని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. కొల్లిపర మండలంలో పర్యటనకు వెళ్లిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు అక్కడి రైతులు ఈ విషయంపై విన్నవించారని గుర్తుచేశారు. మంత్రి పట్టించుకుని తెనాలి, కొల్లిపర మండలాల్లో డీఏపీ, యూరియా అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

యూరియా.. లేదయా!1
1/1

యూరియా.. లేదయా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement