
పోలీసుల కృషితోనే నిందితుడికి సత్వర శిక్ష
నగరంపాలెం: చేబ్రోలులో బాలిక కిడ్నాప్, హత్య కేసులోని రిమాండ్ ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ చేసిన కృషి మరువలేమని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జిల్లా ఎస్పీని బాలిక తండ్రి దావీదు, కుటుంబ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్పీని సత్కరించారు. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారని, నాలుగు నెలల్లో నిందితుడిని అరెస్ట్ చేశారని వారన్నారు. ఈ తీర్పు తమ బిడ్డకు ఘన నివాళి అని తండ్రి పేర్కొన్నారు. సత్వర న్యాయం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ జనార్దన్‌రావు, చేబ్రోలు పీఎస్ ఎస్‌ఐ వెంకటకృష్ణ, బాలిక మేనమామ చిలక లక్ష్మయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.