
సర్వే శాఖ చాంబర్‌లో త్రుటిలో తప్పిన ప్రమాదం
గుంటూరు వెస్ట్: జిల్లా సర్వే శాఖ ఏడీ పవన్ కుమార్, సిబ్బంది త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సర్వే శాఖ ఏడీ చాంబర్‌లోని పైకప్పు కూలిపోయింది. కొన్ని నిమిషాల ముందు వరకు పవన్ కుమార్‌తోపాటు సిబ్బంది కిషోర్ కుమార్, రవితేజ అక్కడే పలు అంశాలపై చర్చించారు. తర్వాత జేసీ భార్గవ్ తేజను కలిసేందుకు బయటకు వెళ్లారు. ఆ సమయంలో జూనియర్ అసిస్టెంట్ హసన్ షరీఫ్, అంటెండర్ సంతోషమ్మ ఫైలు తీసుకునేందుకు ఏడీ చాంబర్‌లోకి వెళ్లారు. కొద్దిగా శబ్దం రావడంతో ఇద్దరూ బయటకు వచ్చేశారు. వెంటనే భారీ శబ్దంతో పైకప్పు మొత్తం కూలిపోయింది. సిబ్బంది బయటకు పరుగెత్తారు. ఏడీ చాంబర్‌లోని టేబుల్ సహా చాలా సామగ్రి ధ్వంసమైంది. ఎప్పుడో 115 సంవత్సరాల క్రితం బ్రిటీషు కాలంలో కట్టిన కార్యాలయం కావడంతో సిబ్బంది మరమ్మతుల కోసం విజ్ఞప్తి చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. కార్యాలయంలో కూర్చోవాలంటేనే సిబ్బంది భయబ్రాంతులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘ నాయకులు కోరుతున్నారు.