
ఆచార్యా.. అర్హులను ఎంపిక చేయండి
ఏఎన్‌యూ తీరుపై అభ్యర్థుల ఆందోళన నిబంధనలు పాటించకుండా ఎంపిక చేయడంపై తీవ్ర ఆగ్రహం అధికారులను నిలదీస్తే రిక్రూట్‌మెంట్ కమిటీ నిర్ణయం అంతిమమని జవాబు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యంత్రాంగం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతన్నాయి. ఫార్మసూటికల్ కళాశాలలో అర్హత కలిగిన వారిని ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ఆచార్యుని నియామకం కోసం జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 19న ఇంటర్వ్యూలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మందికి కాల్ లెటర్స్ అందగా, 14 మంది హాజరయ్యారు. సబ్జెక్టులో పీజీ, పీహెచ్‌డీ తోపాటు 15 సంవత్సరాలు బోధన అనుభవంలో కనీసం ఐదేళ్లు ప్రొఫెసర్ లేదా సీనియర్ ప్రొఫెసర్‌గా అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఆ ఇద్దరికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు?
నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక జరుగుతోందని అభ్యర్థులు ఆందోళన చెందుతూ శుక్రవారం వర్సిటీలోని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, రిజిస్ట్రార్, వైస్ చాన్సలర్‌లను కలసి ఫిర్యాదు చేశారు.
అర్హులను కాదని ఐదేళ్ల ప్రొఫెసర్ అనుభవం కూడా లేని, పీహెచ్ విద్యార్థిని గైడ్ చేయని మహిళకు ఆ పోస్టు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ సామాజిక వర్గానికే చెందడమే ఆమె అర్హతగా చెబుతున్నారు. మరోవైపు ఒక పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చి రెండు పోస్టులకు భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా సిద్ధార్థ ఫార్మసీ కళాశాలకు చెందిన దేవినేని హిరణ్మయి, సింగరాయకొండ మలినేని ఫార్మసీ కళాశాలకు చెందిన తేజోమూర్తిని ఎంపిక చేసినట్లు ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై రిక్రూట్‌మెంట్ కమిటీ నియమించడం జరిగిందని, దాని నిర్ణయమే అంతిమం అని రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.