
మోసపోయాం.. ఆదుకోండి !
నగరంపాలెం: ఐదెకరాల భూమిని ఆన్‌లైన్ చేయిస్తామని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించారంటూ బాధితులు జిల్లా పోలీస్ పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి అర్జీలను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను అలకించారు. బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. జిల్లా ఏఎస్పీ రవికుమార్ (ఎల్‌ఓ), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) శివాజీరాజు (సీసీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు.
టీడీపీ నేతల వే ధింపుల నుంచి రక్షించండి !
టీడీపీ నేతల తప్పుడు ఫిర్యాదులతో ఇబ్బందులకు గురవుతున్నా. మావయ్య శ్రీను ఓ ఎమ్మెల్యే వద్దకు వెళ్తుంటాడు. టీడీపీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి, మరికొందరితో కలిసి ఈనెల 13న మావయ్యపై దాడికి పాల్పడ్డారు. గాయాలైన ఆయనకు చికిత్స చేయించాం, దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. దీంతో ఈనెల 14న జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయగా, స్థానిక పోలీసులకు రిఫర్ చేశారు. అయితే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వ్యక్తులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యల్లేవు. సదరు పోలీస్ అధికారి నాపై తప్పుడు కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేది లేక మరలా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఫిర్యాదు చేసేందుకు వచ్చా. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– రేవతి, స్వర్ణభారతీనగర్
ఆన్‌లైన్‌లో నమోదు పేరుతో మోసం
ఇండియన్ ఆర్మీలో క్లర్క్‌గా చేసి 2005లో ఉద్యోగ విరమణ చేశా. సర్వీస్‌లో ఉండగా మిలటరీ కోటాలో జిల్లా కలెక్టర్ ఐదు ఎకరాల భూమిని 1991లో మంజూరు చేశారు. అయితే, భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తామని ముగ్గురు వ్యక్తులు నమ్మబలికారు. దీంతో తెలిసిన వారేనని రూ.20 లక్షలు చెల్లించా. గత రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు నమోదు చేయించలేదు. దీనిపై వారిని గట్టిగా అడగ్గా, గడిచిన మూడు నెలల్లో రూ.6 లక్షలు చెల్లించారు. మిగతా రూ.14 లక్షలు అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
– పచ్చల సునీల్‌కుమార్,
కొరిటెపాడు
అమెరికాలో ఉద్యోగాల పేరిట నగదు వసూలు
ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ఇద్దరు పరిచమయ్యారు. అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో వారికి ఫోన్‌పే, నగదు రూపేణా రూ.36.38 లక్షలు చెల్లించాం. అయినప్పటికీ ఇంకా రూ.20 లక్షలు చెల్లించాలని తమపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. లేకపోతే ఉద్యోగాలు రావని బెదిరిస్తున్నారు. డబ్బులు చెల్లించలేదని స్పందించడం మానేశారు. అదిగాక నకిలీ ఉద్యోగ ఆఫర్ లేఖలను ఇచ్చేవారు. సరైన సమాచారం ఇచ్చేవారు కాదు. దీనిపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలి.
– బాధితులు,
గుంటూరు నగరం
స్థలం విక్రయించేందుకు నిరాకరణ
నాలుగు నెలలు క్రితం నల్లచెరువు శివార్లల్లోని కొబ్బరితోట సమీపాన 212 గజాల స్థలం మధ్యవర్తుల సమక్షంలో కొనుగోలు చేశా. ఈ క్రమంలో వారికి రూ.12.50 లక్షలు చెల్లించి, అగ్రిమెంట్ చేసుకున్నాం. మిగతా రూ.38 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశాం. ప్రస్తుతం స్థలం విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. మధ్యవర్తులు, పెద్దల సమక్షంలో అడిగినా స్పందించలేదు. కనీసం తాను చెల్లించిన రూ.12.50 లక్షలు తిరిగి చెల్లించాలని ప్రాథేయపడినా అలకించడంలేదు. అగ్రిమెంట్ ద్వారా విక్రయించిన స్థలాన్ని వేరే వ్యక్తులకు రహస్యంగా విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. న్యాయం చేయగలరు.
– కొండపల్లి లక్ష్మీనారాయణ,
శ్రీనివాసరావుపేట
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల వినతి

మోసపోయాం.. ఆదుకోండి !