
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌పై పెట్టిన అన్ని అక్రమ కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. దీంతో ఇవాళ ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. అదీ కుటుంబ సభ్యులు చూస్తుండగానే బలవంతంగా ఆయన్ని జీపు ఎక్కించుకుని తీసుకెళ్లారు.
గుంటూరు జిల్లా జైలు వద్ద బుధవారం పోలీసుల హైడ్రామా నడిచింది. తురకా కిషోర్ రిలీజ్ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఏడు నెలల తర్వాత విడుదల కాబోతుండడంతో వారంతా సంతోషంగా కనిపించారు. అయితే అది ఎంతో సేపు నిలవలేదు.
జైలుకు వచ్చిన వెంటనే ఆయన తన కుటుంబ సభ్యులను దగ్గరికి తీసుకున్నారు. కూతుళ్లను అక్కున చేర్చుకున్నారు. అయితే ఇంతలో రెంటచింతల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంటి బిడ్డలను లాగేసి పడి.. కుటుంబ సభ్యులను నెట్టేసి మరీ.. కిషోర్‌ను బలవంతంగా జీపు ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో పోలీసులు కుటుంబ సభ్యులు చెప్పేది వినకుండా ఆయన్ని బలవంతంగా లాక్కెల్లారు. తోపులాటలో కిషోర్ కూతురు సహా కుటుంబ సభ్యులు కిందపడిపోయారు.
కిషోర్‌ది అక్రమ నిర్బంధమేనని ఆయన కుటుంబ సభ్యులు మండిపడ్డారు. జైలు ఆవరణలో పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ విషయమైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ చెబుతున్నారు.

తురకా కిషోర్ పై మొత్తం 12 కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో 11 హత్యాయత్నం కేసులు, ఒక పీడీయాక్ట్ కేసు నమోదు చేశారు. ఈ పీడీ యాక్ట్ కేసుపై న్యాయ పోరాటం చేయగా.. కోర్టు కేసు కొట్టేసింది. అదే సమయంలో.. మిగతా కేసుల్లో తురకా కిషోర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.