వీఆర్వోను నిర్బంధించిన టీడీపీ నేత | TDP Leader Locks Village Revenue Officer In Kondapuram, Sparks Outrage In Nellore District, More Details Inside | Sakshi
Sakshi News home page

వీఆర్వోను నిర్బంధించిన టీడీపీ నేత

Feb 14 2026 4:56 AM | Updated on Feb 14 2026 4:04 PM

TDP leader detained VRO

ఇస్కదామెర్ల సచివాలయంలో నిర్బంధించి తాళాలు వేసిన వైనం  

టీడీపీ నేతపై పోలీసులకు వీఆర్వోల సంఘం ఫిర్యాదు   

కొండాపురం: తాను చెప్పినట్లు వినడంలేదని టీడీపీ నేత వీఆర్వోను గ్రామ సచివాలయంలో నిర్బంధించి తాళాలు వేసిన అరాచకం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. కొండాపురం మండలం ఇస్కదామెర్లలో శుక్రవారం టీడీపీ నాయకుడు అన్నం సుబ్బారెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ నాయకుడిపై చర్యలు తీసుకోకుండా తహసీల్దారు సురేష్‌ సుతిమెత్తగా మాట్లాడి వీఆర్వోను విడిపించారు. 

బాధిత వీఆర్వో మురళీకృష్ణ, స్థానికులు తెలిపిన మేరకు.. ఇస్కదామెర్లలో మందబైలు భూమిని స్థానిక రైతు కొన్నేళ్లుగా సాగుచేసుకుంటున్నాడు. అతడికి గతంలో రెవెన్యూ అధికారులు పట్టా కూడా మంజూరు చేశారు. సదరు రైతు ఆ భూమిని ఆక్రమించాడని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన సుబ్బారెడ్డి.. దీనిపై తనకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని కొద్దిరోజులుగా వీఆర్వో మురళీకృష్ణపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి వీఆర్వో అంగీకరించలేదు. 

ఈ నేపథ్యంలో శుక్రవారం వీఆర్వో సచివాలయంలో ఉండగా సుబ్బారెడ్డి బయట నుంచి తాళం వేసి నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ సురేష్‌ అక్కడికి చేరుకుని సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలంటూ టీడీపీ నేతకు చెప్పి వీఆర్వోని విడిపించారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ సుబ్బారెడ్డి వ్యవహరించిన తీరు సరికాదని చెప్పారు. వీఆర్వోను నిర్బంధించిన టీడీపీ నేత అన్నం సుబ్బారెడ్డిపై మండల వీఆర్వోల సంఘం నేతలు కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement