
వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్టులు– 20, ల్యాబ్ టెక్నీషియన్లు–3, డేటా ఎంట్రీ ఆపరేటర్లు –16, ఎల్‌జీఎస్‌లు – 47 పోస్టులకు సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, ఉద్యోగాలకు ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు నిరంతరంగా అందించాలని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లామ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, పరిపాలనా అధికారి లక్ష్మీకుమారి, ఆఫీస్ సూపరింటెండెంట్ భక్తవత్సలం, అకౌంట్ ఆఫీసర్ కృష్ణకుమారి, డీపీఓ సైమన్ రాజు, సీనియర్ అసిస్టెంట్లు ప్రసాద్, కార్తిక్ పాల్గొన్నారు.
డిగ్రీ రెండో సెమిష్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
పెదకాకాని(ఏఎన్‌యు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్– మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల రెండో సెమిష్టర్ పరీక్ష ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏసీఈ ఏ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరీక్షలకు అన్ని కోర్సుల నుంచి 9991 మంది హాజరు కాగా, 5642 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తీర్ణత 56.47 శాతంగా ఉందన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చని సూచించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీలకు ఆగస్టు 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫీజు వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచామని చెప్పారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య కృష్ణారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఎ. శివప్రసాదరావు, పరీక్షల విభాగం నోడెల్ ఆఫీసర్ ఆర్. ప్రకాశరావు పాల్గొన్నారు.
నేడు జీజీహెచ్‌లో ఓపీ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఏబీడీఎం ఈ– హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఓపీ, లేబరేటరీ, ఇన్ పేషంట్ సేవలను డిజిటల్ విధానంలో చేపడుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న ఏబీడీఎం వర్షన్ నెక్ట్స్‌జెన్ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మైగ్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. దీని వల్ల సాయంత్రం 9 గంటల వరకు ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సిబ్బంది, రోగులు గమనించి ఆసుపత్రి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
కురగల్లులో ఇరువర్గాల మధ్య ఘర్షణ
తాడేపల్లి రూరల్ : మంగళగిరి మండల పరిధిలోని కురగల్లులో సోమవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వైద్యం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కురగల్లులో పక్క పక్కనే నివిసించే తోట రామారావు, తోట వెంకటేశ్వరరావుల మధ్య ఇంటి దారి విషయంలో పాత గొడవలు ఉన్నాయి. రామారావుకు వత్తాసు పలుకుతూ వెళ్లిన బొర్లా శ్రీనివాసరావుపై వెంకటేశ్వరరావు దాడి చేశాడు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపాడు.

వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు

వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు

వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు