సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే లక్ష్యం

May 27 2025 1:47 AM | Updated on May 27 2025 1:47 AM

సమస్య

సమస్యల పరిష్కారమే లక్ష్యం

లక్ష్మీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని సత్వరం పరిష్కరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్ర శేఖర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎ.భార్గవ్‌ తేజతో కలిసి కేంద్ర మంత్రి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 222 అర్జీలు వచ్చాయి. అర్జీల స్వీకరణ అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందన్నారు. ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎ.భార్గవ్‌ తేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఇకపై గోల్డెన్‌ డే గా నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని కొందరు దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, డీఆర్‌ఓ ఎన్‌ఎస్‌కే ఖాజావలి, స్టెప్‌ సీఈఓ ఆర్‌.చంద్రముని, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సబ్సిడీతో విత్తనాలు, పరికరాలు ఇవ్వాలి

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నా, జిల్లాలో ఇప్పటికీ విత్తనాల పంపిణీ, కౌలురైతుల గుర్తింపు, గ్రామసభల నిర్వహణ వంటి ప్రక్రియలు చేపట్టలేదు. రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వెంటనే 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, పరికరాలు రైతులకు అందజేయాలి.

– కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ

యానిమేటర్‌ పై చర్యలు తీసుకోవాలి

డ్వాక్రా గ్రూపుల నుంచి ప్రతి నెల బ్యాంక్‌లో జమ చేయాల్సిన నగదును, శ్రీనిధి, ఉన్నతి వంటి బ్యాంక్‌ రుణాలకు సంబంధించి కొన్ని నెలలుగా కట్టాల్సిన రూ.15లక్షలను మా గ్రూపు నుంచి వసూలు చేసుకున్న యానిమేటర్‌ బి.శ్యామల వాటిని బ్యాంకులో జమచేయలేదు. బ్యాంక్‌లో మళ్లీ రుణం పొందేందుకు వెళ్లిన మాకు బ్యాంకు వారు విషయం చెప్పడంతో ఆమెను నిలదీస్తే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. తీరా ఇప్పుడు పరారీలో ఉంది. కాకుమాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సదరు యానిమేటర్‌ ఎక్కడుందో మమ్మల్నే వెతికి సమాచారం చెప్పాలని బదులు చెబుతున్నారు. అధికారుల వద్దకు వెళ్లితే కేసు పెట్టుకోమని చెబుతున్నారు. యానిమేటర్‌ను పట్టుకుని, మాకు న్యాయం చేయాలి.

– ప్రశాంతి డ్వాక్రా గ్రూపు,

శ్రీ సత్యన్నారాయణ గ్రూపు సభ్యులు,

గరికపాడు, కాకుమాను మండలం

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌తో కలిసి అర్జీలు స్వీకరణ

దివ్యాంగుల వసతి గృహాన్ని తనిఖీ చేయాలి

స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌లో వున్న దివ్యాంగుల వసతి గృహాన్ని తనిఖీ చేయాలి. అంధులు, దివ్యాంగులను వసతి గృహాంలోకి రానివ్వకుండా మనోవేదనకు గురి చేస్తున్నారు. విచారించి, వారిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా లో 2016 వికలాంగుల చట్టం అమలు కావడం లేదు. చట్టం అమలు అయ్యేలా చూడాలి. విభిన్న ప్రతిభావంతులకు అన్ని కార్యాలయాల్లో స్పెషల్‌ గ్రీవెన్స్‌ ఏర్పాటు చేయాలి.

– విభిన్న ప్రతిభావంతుల

ఆదరణ సేవా సంస్థ ప్రతినిధులు

సమస్యల పరిష్కారమే లక్ష్యం1
1/1

సమస్యల పరిష్కారమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement