గుండిమెడలో రాజకీయ కక్ష సాధింపులు
తాడేపల్లి రూరల్ : మండల పరిధిలోని గుండిమెడలో రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా పదేళ్ల కిందట ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న కల్వర్టును కార్పొరేషన్ అధికారులు శుక్రవారం తొలగించారు. గుండిమెడ, ప్రాతూరు, కుంచనపల్లి పంట పొలాల నుంచి వచ్చిన మురుగు, వర్షపు నీరు బయటకు వెళ్లడం లేదని సాకు చూపిస్తూ తొలగించారు. గుండిమెడకు చెందిన కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు 2005లో తన ఇంటి ముందున్న డ్రైనేజీని ఎనిమిది అడుగుల లోతు తీయించి కాంక్రీట్‌తో నిర్మాణం చేయించారు. దీని పక్కనే గుండిమెడ పంచాయతీగా ఉన్న సమయంలో ప్రధాన రహదారిని కలుపుతూ సీసీ రోడ్డు నిర్మాణాన్ని పంట కాలువ మీదుగా నిర్మించారు. అయితే, రాజకీయ కుట్రల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంటి ముందు కల్వర్టును తొలగించారు.
టీడీపీ వారిపై ప్రేమ
అధికారులు తొలగించిన కల్వర్టుకు 20 అడుగుల దూరంలో కొత్తగా మరో కల్వర్ట్ నిర్మాణంలో ఉంది. అది టీడీపీ వారికి చెందినది కావడంతో దాన్ని తొలగించకుండా వెళ్లిపోయారు. దీనిపై గ్రామస్తులు, బాధితుడైన వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లుగా పలుచోట్ల పంట పొలాల్లోని డ్రైనేజీలను ఆక్రమించడంతో గుండిమెడ, ప్రాతూరు, కుంచనపల్లి గ్రామాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోతున్నాయి. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. కుంచనపల్లి ఆంధ్రరత్న పంపింగ్ స్కీం నుంచి గుండిమెడ మీదుగా మెల్లెంపూడి వరకు వెళ్లే డ్రైనేజీని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల ముసుగులో పూడ్చి వేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. అసలు విషయాన్ని ఎంటీఎంసీ అధికారులు పక్కనపెట్టి, టీడీపీ నాయకులు చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంటీఎంసీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే కుంచనపల్లిలో మాజీ రౌడీషీటర్, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంట పొలాల్లోని డ్రైనేజీలను ఆక్రమించి నిర్మించిన రోడ్డును తొలగించాలని పలువురు కోరుకుంటున్నారు.


