ఈసీఐ నెట్‌లో ఓటర్ల మ్యాపింగ్
కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నెట్ వర్క్ యాప్‌లో ఓటర్ల మ్యాపింగ్ జరుగుతోందని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సంఘం రూపొందించిన సమగ్ర యాప్‌లో ఓటర్ల జాబితా మ్యాపింగ్ జరుగుతోందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 46.96 శాతం పూర్తయ్యిందని తెలిపారు. ఇందులో తాడికొండ నియోజవర్గంలో 56.42 శాతం, మంగళగిరి నియోజవర్గంలో 38.20, పొన్నూరు నియోజవర్గంలో 49.42, తెనాలి నియోజవర్గంలో 40.68 , ప్రత్తిపాడు నియోజవర్గంలో 49.38 , గుంటూరు వెస్ట్ నియోజవర్గంలో 49.44 , గుంటూరు ఈస్ట్ నియోజవర్గంలో 48.51 శాతం జరిగిందని వివరించారు. జిల్లాలోని మొత్తం 17,98,368 మంది ఓటర్లలో 8,44,489 మందిని మ్యాపింగ్ చేశామని తెలిపారు. జనవరి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో తప్పొప్పులు జరిగితే ఫారం 6,7,8 ద్వారా సరి చేస్తామన్నారు. బీఎల్‌ఓలకు కలర్ ఓటర్ జాబితాలతో గుర్తింపు కార్డులను కూడా అందజేశామని వెల్లడించారు. ఇంటి నంబర్లు లేని ఇళ్లకు నోషనల్ నంబర్లను సంబంధిత మున్సిపాలిటీ, పంచాయతీల సహకారంతో ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. 2009 సంవత్సరానికి ముందున్న ఈవీఎం లను వెనక్కు పంపించాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయని, అయితే జిల్లాలో ఏమీ లేవని వివరించారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు కూడా పెండింగ్‌లో లేవని చెప్పారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఓటర్ నమోదు అధికారులు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, శ్రీనివాస్, చల్ల ఓబులేసు పాల్గొన్నారు.


