పత్తి రైతుపై క త్తి
పత్తి నాణ్యతగా లేదంటూ
బయ్యర్ల తిరస్కారం
రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన
సీసీఐ, బయ్యర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం, అనుమానాలు
పోలీసుల రంగప్రవేశం
చివరకు కొనుగోలుకు అనుమతి
ఎట్టకేలకు అన్‌లోడింగ్
ప్రత్తిపాడు: సీసీఐ సిత్రాలు రోజురోజుకూ పత్తి రైతులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. తొలుత నిబంధనలకు అనుగుణంగా నాణ్యత లేదంటూ తిరస్కరించిన పత్తిని, గంటల వ్యవధిలోనే రైతుల రాస్తారోకో అనంతరం అనుమతించి, అన్‌లోడ్ చేయించడంలో మతలబు ఏమిటో అర్థం కాని పరిస్థితి చోటుచేసుకుంది. సీసీఐ సిబ్బంది నిబంధనల వంకతో కావాలనే రైతులను ఇబ్బంది పెడుతున్నారా? లేక బ్రోకర్ల కోసం నిబంధనాల మెలిక పెడుతున్నారా? అనే సందేహాలు బయ్యర్లు వ్యవహరిస్తున్న తీరుతో వ్యక్తమవుతున్నాయి.
బయ్యర్ తీరుపై రైతుల ఆగ్రహం
ప్రత్తిపాడులోని సహజానంద కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రానికి శుక్రవారం ఉదయం అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఇరవై మంది పత్తిని విక్రయించేందుకు ఆటోలు, మినీ లారీలు, ట్రాక్టర్లలో తెచ్చారు. ఉదయం అసిస్టెంట్ బయ్యర్ నవీన్ పత్తిలో కాయ తగులుతుందన్న కారణాన్ని చూపి కొనుగోలు చేయకుండా తిరస్కరించారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అసిస్టెంట్ బయ్యర్ తీరుపై మండిపడ్డారు. దీంతో వారు బయ్యర్ భరత్‌కు సమాచారం అందించడంతో మధ్యాహ్నం తరువాత ఆయన ప్రత్తిపాడుకు వచ్చారు. వాహనాల్లో ఉన్న పత్తిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. నిబంధనలను వివరించాడు. ఆ తరువాత ఆయన కూడా తిరస్కరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల రాస్తారోకో
బయ్యర్ తిరస్కరించడంతో పాలుపోని పత్తి రైతులు సీసీఐ కేంద్రం ఎదుట ప్రత్తిపాడు–పర్చూరు పాత మద్రాసు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి పత్తిని తీసుకుని వస్తున్నామని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి ఇప్పుడు వెనక్కి పంపితే ఆటో బాడుగలు, ఎత్తుడు, దించుడు కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు ఎవరు భరిస్తారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం కూడా కొనుగోలు చేయకుంటే తమ పరిస్థితి ఏమిటంటూ నిలదీస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రోడ్డుకిరువైపులా పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ కె. నరహరి రైతులతో మాట్లాడారు. కొనుగోలు చేసేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ఆయన అసిస్టెంట్ బయ్యర్ నవీన్‌తో మాట్లాడారు.
దీంతో అసిస్టెంట్ బయ్యర్, బయ్యర్ తిరస్కరించిన పత్తిని సాయంత్రం ఏడు గంటల సమయంలో అనుమతించి సీసీఐలోకి అనుమతించారు. సుమారు పదిహేనుకు పైగా వాహనాల్లో మూడు వందల టన్నులకు పైగా పత్తిని ఒకేసారి అన్‌లోడ్ చేయించారు. దీంతో రైతులు ఇదెక్కడి చోద్యమంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి నాణ్యత వంకతో నానా ఇబ్బందులు పెట్టి, ఇప్పుడు ఉన్నట్లుండి పత్తిని కొనుగోలు చేయడంలో ఉన్న ఆంతర్యం.. మతలబు ఏమిటో అర్థం కాక సీసీఐ, బయ్యర్ల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పత్తి రైతుపై క త్తి
పత్తి రైతుపై క త్తి


