
‘అల్లూరి’ సాహసం ఆదర్శనీయం
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
నగరంపాలెం: బ్రిటిష్ వారిపై ప్రథమంగా పోరాడి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి అల్లూరి సీతారామరాజు మార్గదర్శకునిగా నిలిచారని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గిరిజన ప్రజలపై బ్రిటిష్ వారు చేస్తున్న దురాగతాలకు ఎదురొడ్డి పోరాడిన ధీశాలి అని అన్నారు. స్వాతంత్య్ర సమరానికి ఆద్యుడని చెప్పారు. స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటమే సరైన మార్గమని సీతారామరాజు భావించారని తెలిపారు. జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), డీఎస్పీ ఏడుకొండలురెడ్డి, సీఐలు అలహరి శ్రీనివాసరావు, ఆనంద్, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్ నివాళులర్పించారు.
బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మహనీయుడు అల్లూరి
గుంటూరు ఎడ్యుకేషన్: బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెనీ క్రిస్టినా మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా బ్రిటిషు పాలకులను తరిమికొట్టడంలో అల్లూరి వీరోచిత పాత్ర పోషించారని తెలిపారు. అకౌంట్స్ అధికారి పి. శామ్యూల్‌పాల్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి వీరోచితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాటంలో గిరిజనులను సమాయాత్తం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కూచిపూడి మోహన్‌రావు, ఏవో రత్నంబాబు, ఉద్యోగులు తోట ఉషాదేవి, నిర్మల భారతి పాల్గొన్నారు.
మన్యం వీరుడికి ఘన నివాళి
గుంటూరు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. నగర శివారుల్లోని లాంఫాం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో వీసీ డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మీదేవి అల్లూరి చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి. రామచంద్రరావు, అధికారులు, భోధన, భోదనేతర సిబ్బంది అల్లూరి చేసిన పోరాటాలు, నాయకత్వ లక్షణాలను కొనియాడారు.

‘అల్లూరి’ సాహసం ఆదర్శనీయం

‘అల్లూరి’ సాహసం ఆదర్శనీయం