వైఎస్సార్‌ సీపీ నేతపై దాడికి యత్నం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేతపై దాడికి యత్నం

Jun 21 2023 11:27 AM | Updated on Jun 21 2023 11:27 AM

- - Sakshi

కారెంపూడి: పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత బొల్నేడి అమర్‌పై టీడీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. వారిని పోలీసులు నిలువరించడంతో పరిస్థితి సర్దుమణిగింది. మంగళవారం తెల్లవారుజామున బస్టాండ్‌ సెంటర్‌లో టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారాయణ, అమర్‌ మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణకు దిగారు. ఒకరినొకరు నెట్టుకొనే పరిస్థితి నెలకొంది. అక్కడున్న వారు ఇద్దరినీ శాంతింపజేశా రు. అనంతరం లక్ష్మీనారాయణ తన స్వగ్రామం చింతపల్లి వెళ్లగా, అమర్‌ స్థానిక ఆర్‌ అండ్‌ బీ బంగ్లాకు వెళ్లాడు.

అమర్‌పై దాడి చేయాలని నిర్ణయించిన లక్ష్మీనారాయణ.. చింతపల్లి, ఒప్పిచర్ల గ్రామాల నుంచి సుమారు 150 మంది టీడీపీ కార్యకర్తలను కారెంపూడి తరలించారు. తొలుత పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపేందుకు యత్నించారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆపై ఆర్‌ అండ్‌ బీ బంగ్లాలో ఉన్న అమర్‌ను అంతమొందించేందుకు టీడీపీ శ్రేణులు తరలివెళ్లాయి. అయితే దాడి యత్నాన్ని పసిగట్టి బంగ్లాలో ఉన్నవారు తలుపులు వేసుకున్నారు.

తలుపులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. వీలుపడకపోవడంతో బంగ్లా ముందున్న అమర్‌ కారు అద్దాలను ధ్వంసం చేశారు. సీఐ జయకుమార్‌, ఎస్‌ఐ రామాంజనేయులు సిబ్బందితో తరలివచ్చి బంగ్లా వద్ద ఉన్న టీడీపీ కార్యకర్తలను అక్కడ నుంచి వెళ్లగొట్టారు. బంగ్లా వద్ద పోలీస్‌ పహారా ఏర్పాటు చేశారు. అనంతరం బంగ్లాలో ఉన్న అమర్‌ తదితరులను కూడా పోలీసులు అక్కడి నుంచి బయటకు పంపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పోలీసులు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement