బాబు స్కామ్‌ల రోత.. కేసుల మూత 'కేసులు కంచికి'! | Chandrababu Govt Scams in Closing Cases Against Him | Sakshi
Sakshi News home page

బాబు స్కామ్‌ల రోత.. కేసుల మూత 'కేసులు కంచికి'!

Dec 24 2025 4:57 AM | Updated on Dec 24 2025 5:03 AM

Chandrababu Govt Scams in Closing Cases Against Him

అటు ‘స్కామ్‌’లు.. ఇటు క్లోజర్‌లోనూ చంద్రబాబు ‘స్కిల్‌’

‘స్కిల్‌’ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం 

‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌..’ ముసుగులో సీఐడీ 

ద్వారా కుతంత్రం.. పూర్తి ఆధారాలతో బాబు అవినీతిని అప్పట్లో నిగ్గు తేల్చిన సిట్‌ 

అందుకే రిమాండ్‌ విధించిన న్యాయస్థానం 52 రోజులు రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు 

ఇదే కేసులో ఆధారాలున్నాయన్న ఈడీ 

ఇప్పుడు మాత్రం ఆధారాలు లేవంటూ సీఐడీ ‘పచ్చ’ పాట.. కేసు క్లోజ్‌ చేయడంపై అప్పటి స్కిల్‌ కార్పొరేషన్‌ ఎండీకి నోటీసులు 

నిజానికి నాడు ఫిర్యాదు చేసింది కార్పొరేషన్‌ చైర్మన్‌ అజయ్‌రెడ్డి.. స్కిల్‌ స్కామ్‌ కేసు మూసివేతకు కూటమి సర్కారు బరితెగింపు 

ఇప్పటికే చంద్రబాబుపై ఉన్న ఫైబర్‌ నెట్, మద్యం కేసులు అడ్డగోలుగా మూసివేత

నిధులు కొల్లగొట్టారు.. నిగ్గు తేల్చిన ఈడీ.. 
ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా సింగపూర్‌కు తరలించినట్లు గుర్తించింది. డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ జప్తు కూడా చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్‌ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌ (సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ), వికాస్‌ ఖన్విల్కర్‌ (డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్‌ (స్కిల్లర్‌ కంపెనీ ప్రతినిధి), సురేశ్‌ గోయల్‌ (చార్టెడ్‌ అకౌంటెంట్‌)లను అరెస్టు చేసింది.  

సాక్షి, అమరావతి: బరితెగించి అవినీతికి పాల్పడ­టంలోనే కాదు.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేయడంలోనూ చంద్రబాబు తన ‘స్కిల్‌’ ప్రదర్శిస్తున్నారు! నాడు ఆధారాలున్నాయన్న సీఐడీ వాదనతో ఏకీభవించి న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధిస్తే.. నేడు అసలు ఆధారాలే లేవంటూ కోర్టు కళ్లకు గంతలు కట్టేందుకు తెగబడుతున్నారు! 2014 – 19 మధ్య అధికారంలో ఉండగా చంద్రబాబే కుట్రదారు, లబ్ధిదారుగా సాగిన రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం కేసుకు అర్ధ్ధంతరంగా తెరదించేందుకు టీడీపీ కూటమి సర్కారు కుతంత్రానికి సిద్ధపడింది. ఇప్పటికే చంద్రబాబుపై ఫైబర్‌ నెట్, మద్యం కేసులను అడ్డగోలుగా మూసివేసిన ప్రభుత్వం.. తాజాగా స్కిల్‌ స్కామ్‌ కేసుకు గురి పెట్టింది. ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’.. పేరిట ఆ కేసును క్లోజ్‌ చేసేందుకు పక్కాగా పన్నాగం పన్నింది. 

తానే దొంగా.. తానే పోలీసూ!!
తాను ప్రధాన నిందితుడిగా ఉన్న అవినీతి కేసులను ఏడాది క్రితం ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించినప్పుడే చంద్రబాబు ఈ కుతంత్రానికి తెరతీశారు. ఆ బాధ్యతను తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు అప్పగించారు. అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, సీఐడీ చీఫ్‌ రవి శంకర్‌ అయ్యన్నార్‌తోపాటు యావత్‌ పోలీసు, న్యాయ శాఖలను లూథ్రా గుప్పిట్లో పెట్టారు. ఆ కేసుల్లో చార్జ్‌షీట్లను అటకెక్కించారు. న్యాయస్థానాల్లో విచారణకు సహాయ నిరాకరణ చేశారు. 

చంద్రబాబు సాగించిన మద్యం దోపిడీపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైబర్‌నెట్‌ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ మధు­సూదన్‌రెడ్డి, అసైన్డ్‌ భూదోపిడీపై న్యాయ­స్థానంలో సీఆర్‌పీసీ 164 వాంగ్మూలం ఇచ్చిన అప్పటి సీఆర్‌­డీఏ కమిషనర్‌ శ్రీధర్, ఇలా అందరినీ బెదిరించి లొంగదీసుకున్నారు. దీంతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు. అలా సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి మరీ చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధంతరంగా మూసివేతకు టీడీపీ కూటమి ప్రభు­త్వం ఏడాదిన్నరగా సాగిస్తున్న కుతంత్రాన్ని క్లైమాక్స్‌­కు తెచ్చింది. ఈ పన్నాగానికి పదును పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం ‘స్కిల్‌’ కుంభకోణం అడ్డగోలుగా మూసివేత కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. 

స్కిల్‌ కుంభకోణంలో ప్రజాధనాన్ని షెల్‌ కంపెనీల ద్వారా తరలించిన తీరు ఇదీ.. 

‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’ కానే కాదు... బాబే ‘స్కిల్‌’ క్రిమినల్‌..! 
స్కిల్‌ స్కామ్‌ కేసు మూసివేతకు ప్రస్తుతం సీఐడీ అధికారులు ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’ అనే పేరుతో కట్టుకథ అల్లుతున్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పొరపాటుగా అభిప్రాయ­పడ్డాం...! కానీ అసలు అవినీతే లేదు..! అని సీఐడీ పచ్చ పాట పాడుతోంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సీమెన్స్‌ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అప్పట్లోనే సీఐడీ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పూర్తి ఆధారాలతో సహా నిగ్గు తేల్చడం గమనార్హం.

రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి..
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. అయితే చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు 2015 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించలేదు. 

ఇక అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసింది. ఈ కుంభకోణానికి రాచబాట పరుస్తూ మొత్తం 13 నోట్‌ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు కూడా చేశారు. డిజైన్‌ టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. 

ప్రతి దశలోనూ షెల్‌ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్‌ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్‌వా­యిస్‌లను గుర్తించడంతో ఆ కుంభకోణం బయటపడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చింది. సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో ఆ అవినీతి ఆధారాలతో సహా నిగ్గు తేలింది.

సీమెన్స్‌ కంపెనీ ముసుగులో...
2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ కనికట్టు చేశారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ ఎంపీ వికాస్‌ వినాయక్‌ కన్విల్కర్‌ సహకా­రంతో చంద్రబాబు అక్రమా­లకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్‌ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చు­కున్నట్లు జీవో జారీ చేశారు. అడ్డగోలుగా నిధులు కొల్లగొ­ట్టేందుకు కనీసం కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ­రేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీసీతో సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకు­న్నట్లు మభ్యపుచ్చారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌తో తమకు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంటూ సిట్‌కు సీమెన్స్‌ కంపెనీ పంపిన ఈ–మెయిల్‌ 

అవినీతిని నిర్ధారించిన కాగ్‌..
రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌( కాగ్‌) సైతం చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది.

కాగితాలపై ప్రాజెక్టు చూపించి...
జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని చంద్రబాబు కొల్లగొట్టారు. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి, సీమెన్స్‌ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందంటూ బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ సీమెన్స్‌ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ఆ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా హైదరాబాద్‌లోని చంద్రబాబు ప్యాలస్‌కు తరలించారు. ఈ అవినీతి నెట్‌వర్క్‌ను సీఐడీ పక్కా ఆధారాలతో ఛేదించింది. 

ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షీట్‌ కూడా నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్‌ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యలు సాకుగా చూపడంతో హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు.

అవినీతి సొమ్ము.. టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకే!
స్కిల్‌ స్కామ్‌ ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల ద్వారానే బదిలీ చేసినట్లు కూడా ఆనాడు సీఐడీ నిగ్గు తేల్చింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయం తమ బ్యాంకు ఖాతాల్లో భారీస్థాయిలో నోట్లను మార్పిడి చేయడం గమనార్హం. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని యూనియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచీలలో టీడీపీకి బ్యాంకు ఖాతాలున్నాయి. ఆ బ్యాంకు ఖాతాలను సీఐడీ అధికారులు విశ్లేషించడంతో అసలు విషయం బయటపడింది. 2016–18లో ఆ ఖాతాల్లో ఏకంగా రూ.77.37 కోట్ల విలువైన రద్దు అయిన పెద్ద నోట్లను డిపాజిట్‌ చేశారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం పెద్ద నోట్లను డిపాజిట్‌ చేయాలంటే కేవైసీ నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీల ఎన్నికల బాండ్లకు సంబంధించి అయితే రూ.20 వేలకు మించిన డిపాజిట్లపై కేవైసీ నిబంధలను పాటించడం తప్పనిసరి. 

డిపాజిట్‌ చేసినవారి పేరు, పాన్‌ నంబరు, ఫోన్‌ నంబరు, ఐడీ ప్రూఫ్‌ మొదలైన వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. కానీ టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.77.37 కోట్ల విలువైన రద్దు అయిన పెద్ద నోట్లను డిపాజిట్‌ చేసినా సరే... కేవైసీ నిబంధనలను పాటించలేదు. అసలు ఎవరు ఆ నోట్లను ఇచ్చారో ఆ వివరాలు ఏవీ బ్యాంకులకు సమర్పించనేలేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం స్కిల్‌ స్కామ్‌కు పాల్పడటం గమనార్హం. అంటే స్కిల్‌ స్కామ్‌ ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. సీఐడీ ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా నివేదించింది. అయినా సరే ఆధారాల్లేవు..! మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌..! అంటూ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో సీఐడీ వితండవాదం చేస్తుండటం విస్మయపరుస్తోంది.

‘స్కిల్‌’ స్కామ్‌ కేసు మూసివేతకు పక్కా పన్నాగం..
‘స్కిల్‌’ స్కామ్‌ మూసివేత కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభు­త్వం రంగం సిద్ధం చేసింది. అందుకోసం టీడీపీ ప్రధాన కార్యా­లయం స్క్రిప్ట్‌ను సీఐడీ వల్లె వేస్తోంది. ఆ కేసులో ఆధా­రాలు లేవని.. ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’గా ముద్రవేసింది. ‘ఆ కేసు­ను ఇక క్లోజ్‌ చేయాలని భావిస్తు­న్నాం.. మీ అభిప్రాయాన్ని వారం రోజు­ల్లో చెప్పండి..’ అంటూ అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్పొ­రేషన్‌ ఎండీ బంగార్రాజుకు సీఐడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. అంటే అప్పటికే బంగార్రాజును తమ­దైన శైలిలో బెదిరించి దారికి తెచ్చు­కున్నట్లు స్పష్టమైంది. సీఐడీ నోటీసులు ఇవ్వడమే తరు­వా­యి.. ఆ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన లిఖితపూర్వకంగా జవాబు ఇస్తారన్నది సుస్పష్టం. మరి ఇదంతా టీడీపీ పెద్దల స్క్రిప్టే కదా!!

 స్కిల్‌ స్కాం కేసును ముసివేస్తామని అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ బంగార్రాజుకు ప్రస్తుతం సీఐడీ పంపిన నోటీసులు   

ఫిర్యాదుదారు బంగార్రాజు కాదు... చైర్మన్‌ అజయ్‌ రెడ్డి
చంద్రబాబు అవినీతి కేసును అడ్డగో­లుగా మూసివే­యాలన్న ఆతృతలో సీఐడీ అసలు వాస్తవాలను విస్మరిస్తోంది. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్ప­డ్డారని ఆనాడు ఫిర్యాదు చేసింది ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ బంగార్రాజు కాదు. అప్పుడు చైర్మన్‌గా ఉన్న కె.అజయ్‌రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. మరి ఆ కేసును మూసివేయాలని ప్రస్తుతం సీఐడీ భావిస్తే... అందుకు నోటీసులు జారీ చేయాల్సింది కూడా ఆయనకే కదా!! సీఐడీ అధికారులు అందుకు విరుద్ధంగా అప్పటి ఎండీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎందుకంటే ఆయన్ను బెదిరించి... బెంబేలెత్తించి ఇప్పటికే తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడం.. ఆయన సమ్మతించడం.. అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్‌ కథ నడిపించాలన్నది ప్రభుత్వ పెద్దల కుట్ర. 


చంద్రబాబు స్కిల్‌ స్కాంపై ఫిర్యాదు చేసింది అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ అజయ్‌ రెడ్డి అని పేర్కొన్న కాపీ    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement